కీసరలో నకిలీ పోలీసుల దంపతులు అరెస్ట్..రూ.23.91 లక్షలు వసూలు.. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరార్

కీసరలో నకిలీ పోలీసుల దంపతులు అరెస్ట్..రూ.23.91 లక్షలు వసూలు.. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరార్

కీసర, వెలుగు: కీసర ప్రాంతంలో పోలీస్ అధికారుల పేర్లు, హోదాలను అడ్డంపెట్టుకుని అమాయక ప్రజలను మోసగిస్తున్న నకిలీల గుట్టును కీసర పోలీసులు రట్టు చేశారు. నిందితులు అలగోలు శ్రీధర్, నందిని దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జవహర్‌‌‌‌నగర్ ఏసీపీ చక్రపాణి శుక్రవారం కీసర ఠాణాలో వెల్లడించారు.

 పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, సివిల్, ఆస్తి వివాదాలను పరిష్కరిస్తామని శ్రీధర్, నందిని బాధితులను నమ్మించారు. ఫోన్‌‌‌‌పే, యూపీఐ లావాదేవీలు, నగదు రూపంలో పలువురి వద్ద నుంచి రూ.23,91,193 వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారు. బాధితులు డబ్బులు తిరిగి అడగడంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. నిందితులపై గతంలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన కేసులు గోదావరిఖని, చిలకలగూడ పోలీస్ స్టేషన్లలో ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

 ప్రజలెవరూ పోలీసుల పేరు చెప్పి డబ్బులడిగే వాళ్లను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌‌‌‌కు సమాచారం అందించాలని ఏసీపీ సూచించారు. నిందితుల బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మోసానికి సంబంధించి ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నా అనే కోణం దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.