వీ6 చానల్‌పై తప్పుడు ఆరోపణలు

వీ6 చానల్‌పై తప్పుడు ఆరోపణలు

కేసీఆర్‌‌పై స్కిట్ కేసులో ‘వీ6’ చానల్‌కు ఏ సంబంధం లేకపోయినా ఏ5గా రిమాండ్ రిపోర్టులో పోలీసులు చేర్చారు. నిజానికి ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌‌లో ముగ్గురు బీజేపీ నేతలు మాత్రమే నిందితులుగా ఉన్నారు. కానీ జిట్టా రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ5గా చానల్‌ను చూపిస్తూ పరారీలో ఉన్నట్లు రాయడం గమనార్హం. కేసీఆర్‌‌పై స్కిట్‌ను వీ6 ప్రసారం చేసిందని, దాన్ని వీడియో చిత్రీకరించిందని, దాని ఆధారంగా కథనాలు ప్రసారం చేసిందని తప్పుడు ఆరోపణలు చేర్చారు.

నిజానికి వీ6 చానల్‌లో ఈ స్కిట్‌ను ప్రసారం చేయలేదు. వీడియో తీయలేదు. ఎట్లాంటి కథనం వేయలేదు. అమరవీరుల సభ నిర్వాహకులు ఏర్పాటు చేసిన లైవ్ ఫ్రీక్వెన్సీని అందరూ తీసుకున్నారు. అందులో ముఖ్య నేతల ప్రసంగాలను మాత్రమే వీ6 ప్రసారం చేసింది. అయినా ఎఫ్‌ఐఆర్‌‌లో లేకున్నా వీ6 ప్రసారం చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో రాయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరో ఇచ్చిన ఫిర్యాదుతో సంబంధం లేకున్నా కావాలనే చానల్ పేరును చేర్చినట్లు కనిపిస్తోంది. వీ6 లోగోలను వాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు గతంలో పలుమార్లు చానల్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితులను ట్రేస్ చేయలేకపోయామంటూ పోలీసులు ఆ కేసులను పక్కనబెట్టారు.