T20 World Cup 2024: ఓపెనర్‌గా వద్దు.. సచిన్‌లా కోహ్లీ త్యాగం చేయాలి: వీరేంద్ర సెహ్వాగ్

T20 World Cup 2024: ఓపెనర్‌గా వద్దు.. సచిన్‌లా కోహ్లీ త్యాగం చేయాలి: వీరేంద్ర సెహ్వాగ్

టీ20 ప్రపంచ కప్‌లో తలపడే భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతోంది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రోహిత్ ఎలాగూ దూకుడుగా ఆడతాడు కావున, మరో ఎండ్‌లో కోహ్లీ ఉంటే మంచి భాగస్వామ్యం  నిర్మించవచ్చనేది పలువురి అభిప్రాయం. అయితే, ఈ ప్రతిపాదనను వీరేంద్ర సెహ్వాగ్ కొట్టి పారేశారు. జట్టు ప్రయోజనాల కోసం కోహ్లీ తన స్థానాన్ని త్యాగం చేయాలని సూచించారు. 

ఓపెనర్‌గా వద్దే వద్దు..

విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వద్దని.. మూడో స్థానంలో ఆడటమే ఉత్తమమని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. రోహిత్‌ శర్మ, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా దిగాలని సూచించారు. అందుకు 2007 ప్రపంచ కప్‌ సమయంలో మాజీ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తన స్థానాన్ని త్యాగం చేసిన సంధర్భాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. 

"ఒకవేళ నేను జట్టులో ఉండుంటే, కోహ్లీని ఓపెనర్‌గా పంపను. అతను మూడో స్థానంలో ఆడటమే కరెక్ట్. రోహిత్, యశస్వీ ఓపెనర్లుగా  ఉండాలి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడినా.. వన్ డౌన్ లో కోహ్లీ ఉంటాడు కనుక పవర్‌ప్లే‌లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగలడు. అలా కాకుండా వికెట్ ఆలస్యంగా పడితే, మంచి భాగస్వామ్యం ఏర్పడుతుంది. అదే జరిగితే, కెప్టెన్, కోచ్ సూచనలకు అనుగుణంగా కోహ్లీ ఆడాల్సి ఉంటుంది.." అని సెహ్వాగ్‌ వెల్లడించారు. 

సచిన్‌కు ఇష్టం లేదు

అందుకు ఉదాహరణగా సచిన్‌ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్‌.. 2007 ప్రపంచకప్‌ టోర్నీలో టెండుల్కర్‌ తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 

"2007 ప్రపంచ కప్ సమయంలో సచిన్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశారు. నిజానికి.. సచిన్ కు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఇష్టముండదు. అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం అప్పుడతను నాలుగో స్థానంలో ఆడేందుకు ఒప్పుకున్నారు. జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉన్నప్పుడు అలా చేయాల్సి రావొచ్చు.. తప్పదు. కోహ్లీ కూడా ఇప్పుడు తన స్థానాన్ని త్యాగం చేయాలి.  ఓపెనర్లు సెట్‌ చేసిన మూమెంటమ్‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్‌డౌన్‌ బ్యాటర్‌కు ఉంటుంది. ఈ విషయంలో కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా.. భారత జట్టు  జూన్‌ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.