
రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి గురించి జనం ఓ వైపు భయబ్రాంతులకు గురవుతుంటే… మరోవైపు కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను మరింత కంగారు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలందరికీ మహమ్మారి భయం పట్టుకుంది. అయితే తాజాగా మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కరోనా సోకినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయం ఎమ్మెల్యే వరకూ చేరడంతో తనకు కరోనా సోకినట్టు వచ్చిన వార్తలను ఖండించారు. తనకు వైరస్ సోకలేదని , అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.
మరోవైపు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పై ఇలాంటి వార్తలు సృష్టించినందుకు తెరాస నాయకులు మండిపడ్డారు. మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ వార్తకు సంబంధించిన పోస్ట్ ను ఇతర వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసినందుకు పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోనున్నారు.
ప్రముఖ న్యూస్ ఛానెల్ వీ6 న్యూస్ వెబ్ సైట్ లో ఆ వార్త వచ్చినట్టు కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అందుకు సంబంధించి తప్పుడు ప్రచారం చేశారు. ఎమ్మెల్యేకు కరోనా సోకిందన్న వార్తపై పద్మా దేవేందర్ రెడ్డి పీఏ రాజశేఖర్ స్పష్టతనిచ్చారు. MLA గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని , సోమవారం కూడా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు. ఒక మహిళ ప్రజా ప్రతినిధి పై ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించి గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.