15 రోజులు దాటినా డెడ్‌బాడీ ఇవ్వరా?..ఏపీ సర్కార్‌పై బీటెక్ విద్యార్థి రాహుల్ తల్లిదండ్రుల ఆగ్రహం

15 రోజులు దాటినా డెడ్‌బాడీ ఇవ్వరా?..ఏపీ సర్కార్‌పై బీటెక్ విద్యార్థి రాహుల్ తల్లిదండ్రుల ఆగ్రహం
  • 48 గంటల్లో డెడ్ బాడీ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తాం
  • బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరిక

బషీర్‌బాగ్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండలో ఇటీవల బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాహుల్ మరణించి 15 రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని వెంటనే తమకు అప్పగించాలని రాహుల్ తల్లిదండ్రులు అంకం రాజేశ్వర్, వనిత ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ తల్లిదండ్రులు మాట్లాడారు.

తమ కుమారుడిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. డీఎన్ఏ పరీక్షల పేరిట పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో జరిగిన వివాదాల కారణంగానే తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడని కన్నీరుమున్నీరయ్యారు. రాహుల్ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ మాట్లాడుతూ రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగేవరకు తాము పోరాటం చేస్తామన్నారు.

ఈ ఘటన రాష్ట్ర విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసిందని విమర్శించారు. ప్రైవేట్ కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. పోలీసుల దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్​ మృతదేహాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్​ చేశారు. ఈ విషయమై ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నామని, అప్పటివరకు తాము బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలోనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతోపాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు.