తెలంగాణ వ్యాప్తంగా స్థానిక ఎన్నికల హడావిడి ఊపందుకుంది. తొలివిడత స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పల్లెల్లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒక్క ఏకగ్రీవాలతో పలు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనగా.. మిగతా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారాలతో యుద్దవాతావరణం నెలకొంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు. ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లాలో ఓ ఫ్యామిలీ సర్పంచ్ అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. తాము డబ్బులు తీసుకొని ఓట్లు వెయ్యము అంటూ ఇంటి గోడపై పెయింటింగ్ వేయించింది ఓ ఫ్యామిలీ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన యల్లం కొండ వెంకట్ రెడ్డి గ్రామపంచాయితీకి చెందిన ఒక ఫ్యామిలీ ఓటర్లకు ఆదర్శంగా నిలిచింది. మా ఓట్లు అమ్మబడవు అంటూ ఇంటి గోడపై వాల్ పెయింటింగ్ వేయించాడు ఇంటి యజమాని.. ఎన్నికల సమయంలో వచ్చే అభ్యర్థుల నుంచి ఎలాంటి డబ్బు ఆశించకూడదు అంటూ గోడపై పెయింటింగ్ వేయించారు.
తమ ఇంటి గోడకు ఎలాంటి పోస్టర్స్ అంటించరాదని.. మేము డబ్బులు తీసుకొని ఓటు వెయ్యము అంటూ పెయింటింగ్ ద్వారా స్పష్టం చేశారు సదరు ఇంటి సభ్యులు. తమ ఇల్లు సిసి కెమెరా పరిధిలో ఉందని.. తమను ప్రభావితం చేయాలని చుస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆ ఇంటి సభ్యులు.
ఓటుకు డబ్బులు ఇవ్వకపోతే పిలిచి మరీ డిమాండ్ చేసే ఓటర్లు ఉన్న ఈ రోజుల్లో తమ ఓట్లు అమ్మబడవు అంటూ ఇంటి గోడకు పెయింటింగ్ వేయించిన ఈ కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి.
