కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి హత్యకేసులో నిందితుడైన భర్త హరిబాబుకు ఉరిశిక్ష విధించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. గురువారం కోరుట్లలోని కొత్తబస్టాండ్ వద్ద కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కుటుంబ సభ్యులు హైవేపై బైఠాయించారు.
నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వారిని వారించే ప్రయత్నం చేయగా.. కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నిందితుడి కుటుంబసభ్యుల అరెస్ట్
కాగా వైష్ణవి హత్య కేసులో హరిబాబు కుటుంబ సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రాములు తెలిపారు. మెట్‌పల్లిలోని డీఎస్పీ ఆఫీస్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు హరిబాబు తన భార్య వైష్ణవిని కట్న వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ ఘటనలో అతనికి సహకరించిన తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్‌లపై వరకట్న వేధింపులు, హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్ఐ చిరంజీవి వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
