బిజినెస్ చేద్దామని పబ్లిసిటీ కోసం వీడియోలు చేసి..

 బిజినెస్ చేద్దామని పబ్లిసిటీ కోసం వీడియోలు చేసి..

జిమ్‌‌‌‌ పెట్టుకోవాలి అనుకున్నాడు. అంతకుముందే కాస్త పబ్లిసిటీ చేసుకుంటే బిజినెస్‌‌‌‌ బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే ఓ యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టాడు. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ మీద కొన్ని వీడియోలు చేశాడు. కట్ చేస్తే.. యూట్యూబ్‌‌‌‌నే కెరీర్‌‌‌‌గా మలుచుకున్నాడు. అంతటితో ఆగిపోకుండా  అనేక రంగాల్లో అడుగుపెట్టి సక్సెస్‌‌‌‌ అయ్యాడు రణ్‌‌‌‌వీర్‌‌‌‌.

రణ్‌‌‌‌వీర్.. ఫేమస్‌‌‌‌ ఇండియన్ యూట్యూబర్. ఫిట్‌‌‌‌నెస్ కోచ్, సోషల్ మీడియా ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్, పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌ హోస్ట్‌‌‌‌. చాలామంది అతని పేరు ‘బీర్ బైసెప్‌‌‌‌’ అనుకుంటారు. అది ఆయన నడిపే యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పేరు. అతని పూర్తి పేరు రణ్‌‌‌‌వీర్ అరోరా అల్‌‌‌‌బాడియా. రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ వయసు 29 ఏండ్లు. ముంబైలో పుట్టి, పెరిగాడు. వాళ్లది ఆధ్యాత్మిక మూలాలున్న కుటుంబం. తండ్రి గౌతమ్ అల్‌‌‌‌బాడియా,  తల్లి స్వాతి. సోదరి ఆకాంక్ష. ఈ కుటుంబంలో రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ తప్ప అందరూ డాక్టర్లే. రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ ముంబైలోని ధీరుబాయ్‌‌‌‌ అంబానీ ఇంటర్నేషనల్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో చదువుకున్నాడు. తర్వాత ద్వారకాదాస్‌‌‌‌ జే. సంగ్వీ కాలేజీలో ఇంజినీరింగ్‌‌‌‌ పూర్తి చేశాడు. 

అలా మొదలైంది

ఇప్పటి రణ్‌‌‌‌వీర్‌‌‌‌కి ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌కి చాలా తేడా ఉంది. అప్పట్లో రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ పార్టీలు, క్లబ్‌‌‌‌లు అంటూ ఎక్కువగా ఫ్రెండ్స్‌‌‌‌తోనే గడిపేవాడు. స్మోకింగ్, డ్రింకింగ్‌‌‌‌ చేసేవాడు. అప్పటినుంచే అతనికి ఎంట్రప్రెనూర్‌‌‌‌‌‌‌‌గా ఎదగాలనే కోరిక ఉండేది. అందుకోసం ఆ అలవాట్లన్నీ వదిలేసి పూర్తిగా మారిపోయాడు. లైఫ్‌‌‌‌లో సక్సెస్‌‌‌‌ కావాలనే గోల్‌‌‌‌తో చాలా కష్టపడ్డాడు. హెల్దీ లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ని అలవాటు చేసుకున్నాడు. మెడిటేషన్‌‌‌‌ చేయడం మొదలుపెట్టాడు. అదే టైంలో చదువు పూర్తయింది.

అప్పుడు అతనిలో ‘‘తర్వాత ఏంటి?”అనే ప్రశ్న తలెత్తింది. రణ్‌‌‌‌వీర్‌‌‌‌కి జాబ్‌‌‌‌ చేయడం ఇష్టం లేదు. అతని లైఫ్​ ఉద్యోగానికే పరిమితం కాకూడదనుకున్నాడు. అందుకే ఏదైనా బిజినెస్‌‌‌‌ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడతనికి జిమ్‌‌‌‌ పెట్టాలనే ఐడియా తట్టింది. కానీ.. ఇలా సడెన్‌‌‌‌గా జిమ్‌‌‌‌ పెడితే ఎవరొస్తారు? అనే డౌట్‌‌‌‌తో ముందుగా డిజిటల్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ చేయాలి అనుకున్నాడు. సోషల్‌‌‌‌ మీడియా ద్వారా అందరికీ పరిచయమై, తర్వాత జిమ్‌‌‌‌ పెట్టాలన్నది ఆయన ఆలోచన. అందుకోసం 2014 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఒక యూట్యూబ్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ పెట్టాడు. అలా పుట్టిందే ఈ ‘‘బీర్‌‌‌‌‌‌‌‌ బైసెప్స్‌‌‌‌’’. 

ఇలా డెవలప్‌‌‌‌.. 

రణ్‌‌‌‌వీర్ ఈ ఛానెల్‌‌‌‌ని మొదలుపెట్టింది ఫిట్‌‌‌‌నెస్, హెల్త్‌‌‌‌ మీద ఆసక్తి ఉన్నవాళ్ల కోసమే. కానీ.. ఛానెల్‌‌‌‌కు ఫాలోవర్స్ పెరగడంతో ఫ్యాషన్, గ్రూమింగ్‌‌‌‌, పర్సనల్‌‌‌‌ ఫినాన్స్‌‌‌‌, మెడిటేషన్‌‌‌‌, మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌‌‌‌ లాంటి అంశాలను కవర్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పాడ్‌‌‌‌కాస్ట్ ఛానెల్‌‌‌‌గా కూడా మార్చేశాడు. కొన్ని రోజుల నుంచి ఈ ఛానెల్‌‌‌‌లో పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లను అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తున్నాడు. ఒక్క ఛానెల్‌‌‌‌తో మొదలైన రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ ప్రయాణం మరో ఏడు ఛానెళ్లకు చేరింది.

ఇప్పుడు మొత్తం ఎనిమిది ఛానెళ్లను నడుపుతున్నాడు. అందులో  మెయిన్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ ‘‘బీర్‌‌‌‌‌‌‌‌బైసెప్స్‌‌‌‌”కి 4.1 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్‌‌‌‌ ఉన్నారు.  ‘‘రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌బాడియా” ఛానెల్‌‌‌‌కు 3.44 మిలియన్లు, ‘‘టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ క్లిప్స్‌‌‌‌’’కి 5.7 లక్షలు, ‘‘టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ క్లిప్స్‌‌‌‌ హిందీ’’కి 2.95 లక్షలు, ‘‘బీర్‌‌‌‌‌‌‌‌ బైసెప్స్ షార్ట్స్‌‌‌‌’’కి 2.53 లక్షలు, ‘‘రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ అల్‌‌‌‌బాడియా షార్ట్స్‌‌‌‌”కి 2.29 లక్షలు, ‘‘బిగ్‌‌‌‌బ్రెయినికొ”కి 7.07 లక్షలు, ‘‘బిగ్‌‌‌‌బ్రెయినికొ షార్ట్స్‌‌‌‌”కి 39.6 వేల మంది సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. 

పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌

యూట్యూబ్‌‌‌‌ ఇచ్చిన సక్సెస్‌‌‌‌తో పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌ హోస్ట్‌‌‌‌గా కూడా కెరీర్‌‌‌‌‌‌‌‌ని మొదలుపెట్టాడు రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌. ‘‘ది రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ షో” (టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌) పేరుతో 2019లో ఒక పాడ్ కాస్ట్ సిరీస్‌‌‌‌ని స్టార్ట్‌‌‌‌ చేశాడు. దీనికి వివిధ రంగాల్లోని  ప్రముఖ వ్యక్తులను గెస్ట్‌‌‌‌లుగా తీసుకొస్తున్నాడు. ఈ వీడియోలు ఇంగ్లీష్‌‌‌‌, హిందీ భాషల్లో వస్తున్నాయి. గ్యారీ వాయెర్‌‌‌‌చుక్, ప్రియాంక చోప్రా, కునాల్ షా, గ్లెన్ మెక్‌‌‌‌గ్రాత్, సద్గురు, అజయ్‌‌‌‌దేవ్‌‌‌‌గన్‌‌‌‌ లాంటివాళ్లు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు వచ్చారు. 

మాక్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌ 

రణ్‌‌‌‌వీర్‌‌‌‌‌‌‌‌ తన కాలేజీ జూనియర్‌‌‌‌ విరాజ్‌‌‌‌తో కలిసి 2018లో ‘‘మాక్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌” అనే సంస్థను మొదలుపెట్టాడు. ఇది డిజిటల్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌, బ్రాండ్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌, కంటెంట్‌‌‌‌ క్యురేషన్‌‌‌‌, వీడియో ప్రొడక్షన్‌‌‌‌, లాంటి వాటిని డీల్‌‌‌‌ చేస్తోంది. సోషల్‌‌‌‌ మీడియా కన్సల్టింగ్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియా హ్యాండ్లింగ్‌‌‌‌, ఇన్‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ లాంటి సర్వీసులను అందిస్తోంది. 
రణ్‌‌‌‌వీర్​కు అనేక మార్గాల నుంచి ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు 49 కోట్ల రూపాయలు సంపాదించాడని ఒక అంచనా. ప్రస్తుతం యూట్యూబ్‌‌‌‌, అతని సంస్థల నుంచి కలిపి నెలకు దాదాపు 25 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.