- ఇది వరకే కొన్నింటి రేట్ల పెంపు
- యుద్ధంతో అధికమైన ఖర్చులు
- వర్షాలు లేకుంటే మరిన్ని ఇబ్బందులు
న్యూఢిల్లీ:ఇక నుంచి కిరాణా షాపుకు వెళ్తే జేబుపై అదనపు భారం తప్పకపోవచ్చు. సబ్బులు, షాంపూలు, వాషింగ్ పౌడర్లు వంటి ఫాస్ట్ మూవబుల్కన్జూమర్గూడ్స్(ఎఫ్ఎంసీజీ) తయారు చేస్తే కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. యుద్ధం వల్ల ప్యాకేజింగ్, మెటీరియల్, ముడి పదార్థాలు ధరలు, రవాణా ఖర్చులు పెరగడమే కారణం. వాటికా షాంపూ తయారీ సంస్థ డాబర్ ఇండియా మరికొన్ని రోజుల్లోనే ధరలను మార్చాలని భావిస్తోంది. ఇది ఇటీవలే ధరలను 4 శాతం పెంచింది.
హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) వంటి కంపెనీలు ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాయి. మార్చి క్వార్టర్లో గ్రామాల్లో డిమాండ్ పెరగడం ఎఫ్ఎంసీజీ సంస్థలకు మేలు చేసింది. అయితే, ప్యాకేజింగ్ మెటీరియల్స్, రవాణా ఖర్చులు, పాలు, వంట నూనెలు, పిండి ధరలు పెరుగుతుండటంతో ఇవి ఆందోళన చెందుతున్నాయి.
యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ తయారీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. టీ, ముడి చమురు ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరగడం హెచ్‌యూఎల్‌కు సవాలుగా మారింది. సబ్బులు, డిటర్జెంట్లు, టీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల ధరలను ఇది మార్చే అవకాశం ఉంది.
నెస్లే, బ్రిటానియా కూడా..
కాఫీ, పాల ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ధరల సవరణ తప్పకపోవచ్చని నెస్లే వర్గాలు తెలిపాయి. మారికో మార్చి క్వార్టర్‌లో మెరుగైన ఫలితాలను సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ కనిపిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలపై కంపెనీ దృష్టి సారించింది. ఇది కూడా పెంపు బాట పడుతుందని భావిస్తున్నారు. బ్రిటానియా ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులను తట్టుకోవడానికి జూన్ క్వార్టర్‌లో ధరల పెంపు, బరువు తగ్గింపు వంటివి చేయనుంది.
బిస్కెట్ల బరువు తగ్గించి, రూ.10 కంటే ఎక్కువ ధర ఉన్న ప్యాకెట్లపై ధరలు పెంచే అవకాశం ఉంది. బరువు తగ్గించడం, ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీలు ఈ సమస్యలను ఎదుర్కోవాలని భావిస్తున్నాయి. ముడి చమురు ధరలు మరింత పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై భారం పడే అవకాశం ఉంది. వర్షాలు కూడా తక్కువ పడితే ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
