క్రికెట్ మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ

 క్రికెట్ మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య  క్రికెట్ మ్యాచ్ అంటే మస్తు మజా ఉంటుంది. ఈ రెండు టీమ్ లు ఆడుతుంటే స్టేడియంలో కూర్చుని భారత బ్యాటర్లు సిక్స్ లు, ఫోర్లు కొడుతుంటే చూడాలని అభిమానులు ఆరాట పడతారు.  వెంటనే టికెట్స్ కొనుగోలు చేసి మ్యాచ్ ను దగ్గర నుంచి వీక్షిస్తూ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పేటీఎం ద్వారా ఆన్ లైన్ బుకింగ్ లో 15 నిముషాలలో టికెట్స్ అయిపోవడం తో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.  రెండేండ్ల తర్వాత ఈనెల 25 న  ఉప్పల్ స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా  మ్యాచ్ జరగనుంది. వివిధ రాష్ట్రాలు , తెలంగాణలోని పలు జిల్లాల నుంచి  అభిమానులు టికెట్స్ కొనుగోలు చేసేందుకు జింఖానా గ్రౌండ్, ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. 

జింఖానా గ్రౌండ్ కు వచ్చి టికెట్ల కోసం గంటల కొద్దీ  అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ క్రికెట్ మ్యాచ్ టికెట్ విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్  కాకపోవడంతో ప్రస్టేషన్ కు గురవుతున్నారు. వారం రోజులుగా టికెట్ కోసం వస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. టికెట్స్ కోసం వస్తే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం తెలియదని గేట్లకు తాళాలు వేస్తున్నారని చెబుతున్నారు. ఉప్పల్ స్టేడియం, జింఖానా గ్రౌండ్ దగ్గర అభిమానుల పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. అక్కడి నుంచి వారిని పంపిస్తున్నారు. టికెట్స్ ఇవ్వనప్పుడు మ్యాచ్  ఎందుకు గ్రౌండ్ ఎందుకు అంటూ ప్రస్టేషన్ కు లోనవుతున్నారు. 

ఉప్పల్ వెళ్తే జింఖానా వెళ్ళమని... జింఖానా వస్తే తమకేం తెలియదని హెచ్ సీఏ సిబ్బంది చెబుతుందని వాపోతున్నారు. దీంతో జింఖానా గ్రౌండ్స్ వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. టికెట్ల పై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. HCA స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.