
నిజాంపేట, వెలుగు: ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలో చోటుచేసుకుంది. తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన బెల్లం మల్లయ్య ( 53 )కు ఎకరం పొలం ఉంది. గత వానాకాలం సీజన్ లో అప్పుతెచ్చి అందులో వరి పంట సాగు చేశాడు. అయితే ఆశించిన దిగుబడి రాక నష్టపోయాడు. పంట సాగు పెట్టుబడికి చేసిన అప్పు, మిత్తితో కలిపి రూ.4 లక్షల వరకు అయ్యింది. అంతేగాక, భూమి విషయంలోనూ గత ఐదేండ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. అప్పుల బాధతోపాటు కేసు కూడా తేలడం లేదని మల్లయ్య మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఊరి చివర చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. భార్య బీరవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.