దేశంలో రైతు ఆత్మహత్యలు తగ్గినయ్

దేశంలో రైతు ఆత్మహత్యలు తగ్గినయ్
  •     దేశానికి వ్యవసాయ రంగం ఎంతో కీలకం: గవర్నర్ రాధాకృష్ణన్​
  •     దిగుమతులపై ఆధారపడే స్థితిలో మనం లేం
  •     అగ్రికల్చర్ సెక్టార్​లో టెక్నాలజీ పెరిగింది
  •     జయశంకర్ అగ్రి వర్సిటీ కాన్వొకేషన్​లో గవర్నర్‌‌

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయని రాష్ట్ర ఇన్‌చార్జ్​ గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. దేశానికి వ్యవసాయ రంగం ఎంతో కీలకమని, మానవ సమాజం మనుగడకు ప్రధాన ఆధారమని తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన ఇండియా.. తన అవసరాల కోసం వ్యవసాయ దిగుమతులపై ఆధారపడే పరిస్థితిలో లేదని స్పష్టం చేశారు. తమకు అవసరమైన పంటలను సొంతంగా పండించుకుంటున్నదని తెలిపారు. 

వ్యవసాయ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు. సోమవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 6వ కాన్వొకేషన్ 

ప్రోగ్రామ్​కు గవర్నర్  చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ‘‘విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసం, అంకితభావంతో ముందుకెళ్లాలి. జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. పరిశోధన, ప్రయోగ ఫలితాలను రైతులు ప్రత్యక్షంగా చూస్తేనే వాటిని స్వీకరిస్తారు. వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యవసాయం చేయాలంటే విత్తనం ఎంతో కీలకం. అగ్రి వర్సిటీ నుంచి మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండటం సంతోషకరం’’అని రాధాకృష్ణన్ అన్నారు.

అగ్రి స్టార్టప్​లకు ప్రాధాన్యత పెరిగింది

దేశవ్యాప్తంగా అగ్రి స్టార్టప్​లకు ప్రాధాన్యత పెరిగిందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకుని అగ్రి ప్రెన్యూర్స్​గా ఎదగాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలో 82శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నరు. జనాభాలో 45 నుంచి 46 శాతం మంది వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడుతున్నరు. అయినప్పటికీ జీడీపీలో అగ్రికల్చర్ వాటా మాత్రం 17 నుంచి 18 శాతం మాత్రమే ఉంది’’అని అన్నారు. 

వ్యవసాయ రంగంలో పరిశోధనలకు నిధుల కేటాయింపులు పెరగాలని, గోదాముల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్​కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మారుతున్న వాతావరణం, టెక్నాలజీకి అనుగుణంగా రైతులు సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. అగ్రివర్సిటీ ప్రగతిని యూనివర్సిటీ ఇన్​చార్జ్ వీసీ ఎం.రఘునందన్ రావు వివరించారు. ఈ సందర్భంగా 587 స్టూడెంట్లకు అండర్ గ్రాడ్యుయేట్ పట్టాలు, 165 స్టూడెంట్స్​కు పీహెచ్​డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలు అందజేశారు. 

11 మంది పీజీ విద్యార్థులకు 12 గోల్డ్ మెడల్స్, 8 మంది యూజీ విద్యార్థులకు 19 బంగారు పతకాలు అందజేశారు. బజ్జూరి దివ్య, వెలిచాల సాయి ప్రత్యూష చెరో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పి.రఘురామిరెడ్డి, వర్సిటీ అధికారులు, బోర్డు సభ్యులు, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు, మాజీ వీసీలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్, పేరెంట్స్ పాల్గొన్నారు.