ధరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నరు - షబ్బీర్ అలీ

ధరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నరు - షబ్బీర్  అలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా సమస్యలను బీజేపీ, టీఆర్ఎస్ దారిమళ్లిస్తూ  డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్  నేత షబ్బీర్  అలీ అన్నారు. పబ్లిక్ కు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే సర్కారు పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. 2014, 2018లో ఎన్నికైన టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొన్నారని, ఆ ఎమ్మెల్యేల కొనుగోలుపై  సిట్ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 

‘‘ధరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నరు. రెండున్నర ఎకరాలు నా పట్టా భూమి గాయబ్ అయిందని అధికారులకు చెబితే..  సరిదిద్దుతం అని ఆన్సర్ ఇస్తున్నరు. నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంది. పరిస్థితి ఇలాగే ఉంటే నక్సలైట్లను ఆశ్రయించాల్సిన అవసరం వస్తుంది” అని షబ్బీర్ హెచ్చరించారు. ఈడీ నోటీసులు ఇస్తే సోనియా, రాహుల్  వెళ్లినపుడు బీఎల్ సంతోష్ ఎందుకు అటెండ్  కావడం లేదని  ఆయన ప్రశ్నించారు. విచారణకు హాజరై సంతోష్​ తన నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన కోరారు. అందరినీ తమ ఆఫీసులకు పిలిపించిన సీబీఐ, ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఎందుకు పిలవరని, ఇదేం డ్రామా అని నిలదీశారు.