రైతన్నకు అప్పుల తిప్పలు

రైతన్నకు అప్పుల తిప్పలు

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్ర రైతన్నలు అప్పుల కోసం తిప్పలు పడుతున్నరు. పంట రుణాలు అందక ఇబ్బంది పడుతున్నరు. పాత అప్పులు మాఫీ కాక, కొత్త అప్పు పుట్టక తంటాలు పడుతున్నరు. పాత రుణాలను ప్రభుత్వం మాఫీ చేసినా ఇప్పటివరకు మార్గదర్శకాలు లేక బ్యాంకుల నుంచి అప్పు పుట్టట్లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌‌లో రూ.29,244 కోట్ల పంట రుణాలివ్వాలని స్టేట్‌‌ లెవల్‌‌ బ్యాంకర్స్‌‌ కమిటీ నిర్ణయించినా ఇప్పటివరకు రూ.6,595 కోట్లే మంజూరైనట్టు లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా లక్ష్యంలో 22 శాతమే బ్యాంకులు మంజూరు చేశాయి. ఖరీఫ్‌‌ ప్రారంభమై నెలన్నరైనా సగం కూడా రుణాలివ్వకపోవడంతో రైతన్నలు ప్రైవేటు వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు చేస్తున్నారు.

రీ షెడ్యూల్‌‌ చేసుకున్న వాళ్లకే

గత డిసెంబర్‌‌ 11ను ప్రభుత్వం కటాఫ్‌‌ తేదీగా ప్రకటించి రూ. లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామంది. కటాఫ్‌‌ డేట్‌‌ ప్రకటించినా రుణాల మార్గదర్శకాలు ప్రకటించక పోవడంతో మాఫీ కాలేదు. లోన్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు పాత వాటిని రీ షెడ్యూల్‌‌ చేసుకోవడం లేదు. దీంతో కొత్త లోన్లు రావడం లేదు. బ్యాంకులేమో లోన్లు రీ షెడ్యూల్‌‌ చేసుకున్న వారికే కొత్త రుణాలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఓ వైపు రైతుబంధు పెట్టుబడి అందక, మరోవైపు కొత్త రుణాలివ్వక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొద్దిపాటి వర్షాలు రావడంతో విత్తనాలు వేసిన వాళ్లు రుణాల కోసం ఎదురు చూడలేక ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లోని డిపాజిట్లలో 18 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వాలు పట్టించుకోక నిబంధనలు అమలవడం లేదు.

తక్షణమే రుణాలివ్వాలి

రైతు రుణాలపై ప్రభుత్వం పట్టనట్లు వ్యహరిస్తోంది. మాఫీపై ఇప్పటికీ మార్గదర్శకాలు ఇవ్వలేదు. రుణాలు రెన్యువల్‌‌ చేసుకుంటే మాఫీ రాదేమోనని రైతులు భయపడుతున్నారు. మాఫీ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. బ్యాంకులతో మాట్లాడి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. – టీ సాగర్‌‌, రాష్ట్ర కార్యదర్శి, రైతు సంఘం