- రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆదేశించారు. మొంథా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల వద్ద వేగవంతంగా పనులు చేపట్టాలని సూచించారు. మంగళవారం బీఆర్కే భవన్‌లో సివిల్సప్లయ్స్ ప్రొక్యూర్‌మెంట్ జీఎం నాగేశ్వర్ రావుతో జరిపిన సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కాంటా వేయాలని స్పష్టం చేశారు. కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే బాధ్యత అధికారులు, సిబ్బంది స్వయంగా చూసుకోవాలన్నారు.
రైతులపై ఈ బాధ్యత వేయొద్దని ఆదేశించారు. లారీలకు ఎక్కించిన ధాన్యం మిల్లులకు చేరే వరకు రైతులను బాధ్యులుగా చేయొద్దని సూచించారు. ధాన్యం సేకరణకు నిర్ణయించిన 8,342 కొనుగోలు కేంద్రాల్లో 4, 428 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించామని జీఎం నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన 3,814 కేంద్రాలు త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతున్నదని చెప్పారు. కేంద్రాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేశామని కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, మెంబర్ సెక్రటరీ గోపాల్, అధికారులు సంధ్యారాణి, హరి వెంకట ప్రసాద్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
