కేంద్రం తెచ్చిన విత్తన చట్టం ముసాయిదా కంపెనీలకే అనుకూలం : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

కేంద్రం తెచ్చిన విత్తన చట్టం ముసాయిదా కంపెనీలకే అనుకూలం : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
  •     రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విత్తన చట్టం ముసాయిదా పూర్తిగా విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉందని కోదండరెడ్డి విమర్శించారు. విత్తనాలు, రసాయన ఎరువుల రంగం మల్టీనేషనల్ కంపెనీల ఆధిపత్యంలోకి వెళ్లిపోయిందని, గతంలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలను గత ప్రభుత్వం కంపెనీలకు కట్టబెట్టిందని ఆరోపించారు.

ఈ మేరకు సోమవారం రైతు కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన విత్తన చట్టం ముసాయిదా కమిటీ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముసాయిదాలను పోల్చి లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విత్తన చట్టం ముసాయిదా తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.“రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని విత్తన చట్టం ముసాయిదాను రూపొందించాం. గత ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతున్నాం. రైతులకు ఇప్పటికే 1.1 లక్షల కోట్ల ఆర్థికసాయం అందించాం” అని చెప్పారు. ములుగు జిల్లాలో ఆదివాసీ రైతులకు ప్రైవేట్ కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో కమిషన్ జోక్యం చేసుకుని దాదాపు రూ.4 కోట్ల పరిహారం ఇప్పించిందని వెల్లడించారు. మిర్చి, పత్తి, వరి విత్తనాల విక్రయాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.