కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆధ్వర్యంలో రైతు సంఘం బృందం ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
చీమలపాడు, జూలూరుపాడు గుట్టల్లో అండర్ టన్నెల్ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. కారేపల్లి మండలానికి కూడా సీతారామ ప్రాజెక్టు నీరు వచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులైన రైతులకు అందరికీ సమానంగా పరిహారం అందించాలని, పట్టాల పేరుతో తేడా చూపించకుండా పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దుగ్గి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, మద్దెల నాగయ్య, రాజేష్, భద్రయ్య పాల్గొన్నారు.
