జీరో టారిఫ్ లు మన రైతులకు శాపమే!... ఎంఎస్పీ కన్నా 10 శాతం ఎక్కువగా దిగుమతి సుంకాలు ఉండాలి: నిపుణులు

జీరో టారిఫ్ లు మన రైతులకు శాపమే!... ఎంఎస్పీ కన్నా 10 శాతం ఎక్కువగా దిగుమతి సుంకాలు ఉండాలి: నిపుణులు
  •     పత్తి, మక్క, పల్లీ, ఆయిల్‌పామ్ రైతులకు తీవ్ర ఇబ్బందులు
  •     కేంద్రం చర్యలతో విదేశీ కార్పొరేట్‌లకే లాభమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అమెరికా నుంచి జీరో టారిఫ్‌తో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం ఇక్కడి రైతులకు పెద్ద శాపంగా మారుతోంది. పత్తి, మొక్కజొన్న, వేరుసెనగ, ఆయిల్‌పాం సాగు చేసే లక్షలాది రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ దిగుమతులు దేశీయ మార్కెట్‌లో ధరలను కుప్పకూల్చి, రైతుల ఆదాయాన్ని  తగ్గిస్తాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి రైతులను బలి చేస్తోందని ఎస్​కేఎం వంటి సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. 

‘‘అమెరికా నుంచి ముడిపదార్థాలు కొనుగోలు చేస్తే భారత్‌కు జీరో డ్యూటీ ఎగుమతులు’’ అనే ప్రకటనను రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది భారత స్వావలంబన, సార్వభౌమత్వాన్ని అమెరికాకు అప్పగించడమేనని, వ్యవసాయాన్ని ఒప్పందం నుంచి మినహాయించారనే ప్రభుత్వ వాదన అబద్ధమని స్పష్టం చేసింది. జీరో టారిఫ్  దిగుమతులు విదేశీ కార్పొరేట్  శక్తులకు మాత్రమే లాభం చేకూరుస్తాయని, మన రైతులకు శాపమని అగ్రికల్చర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పత్తి రైతుల సమస్యలు తీవ్రం

2025 వానాకాలం పత్తి పంట క్వింటాల్‌కు రూ.10,075 మద్దతు ధర ఉండాలి.  కానీ, వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్  ఆధారంగా రూ.7,710 మాత్రమే ప్రకటించారు. ఇది సీ2 ఫార్ములా కన్నా   రూ.2,365 తక్కువ. పలు నిబంధనలు యాప్​ల పేరిట సీసీఐ వేధింపులతో రైతులు తమ పంటను క్వింటాల్‌కు రూ.5,500 నుంచి రూ.6,500 వరకే అమ్ముకోవాల్సి వస్తోంది. 

ఇప్పటికే గత ఆగస్టు 19న కేంద్రం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తొలగించడంతో పరిస్థితి మరింత దిగజారింది. అమెరికా నుంచి పత్తి దిగుమతులు 2024 జనవరి నుంచి- నవంబర్‌లో 199.30 మిలియన్ డాలర్ల ఉంటే అది 2025లో 377.90 మిలియన్ల డాలర్లకు (95.5 శాతం) పెరిగాయి. ఇది దేశీయ ధరలను తగ్గించి, లక్షలాది పత్తి రైతు కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తోంది.

మద్దతు ధర కంటే 10% అదనంగా సుంకాలు ఉండాలి  

మద్దతు ధర కంటే కనీసం 10 శాతం అదనంగా దిగుమతి సుంకాలు ఉండాలని, అప్పుడే దేశీయ రైతులు రక్షణ పొందుతారని అగ్రికల్చర్  నిపుణులు సూచిస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సున్నా సుంకం విధానంతో రైతులను నేరుగా దెబ్బతీస్తోందని తెలిపారు. ఇండియా, -యూఎస్  వాణిజ్య ఒప్పందం ఆపిల్, పత్తి, చెట్టు గింజలు, సోయాబీన్  నూనె, వైన్, స్పిరిట్స్, పశుగ్రాసం, మొక్కజొన్న, ఎర్రజొన్న ఆధారిత డీడీజీల దిగుమతులకు దారులు తెరుస్తోందని, ఇది అమెరికన్  కంపెనీలకు భారత మార్కెట్‌లో నేరుగా స్థానం కల్పించడమేనని  రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

యూరోపియన్  యూనియన్, న్యూజిలాండ్, యునైటెడ్  కింగ్‌డమ్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో పాల ఉత్పత్తులు చేర్చారు. ఇవన్నీ కలిపి వ్యవసాయం, పాడి రంగాలను బహుళజాతి సంస్థలకు అప్పగించడమేనని నిపుణులు చెప్తున్నారు. జీరో టారిఫ్ లతో మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్‌పామ్  రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై దిగుమతులు పెరిగితే వారి స్థితి మరింత దారుణమవుతుందని హెచ్చరిస్తున్నారు.