మాండౌస్ తుఫాన్.. రైతులకు తీవ్ర ఇబ్బందులు

మాండౌస్ తుఫాన్.. రైతులకు తీవ్ర ఇబ్బందులు

మాండౌస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నారు. కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్లే ఇబ్బందులు వచ్చాయని అంటున్నారు.  

ధాన్యం కొనుగోలు ఆలస్యం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం..చలిగాలులు..రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీలో వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులకు కష్టాలు వచ్చాయి. కళ్లాల్లోని ధాన్యం కాపాడుకొనేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో 170 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయి. వీటిలో 103 సెంటర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. మిగతా 67  కేంద్రాలలో ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభం కాలేదు. జిల్లావ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా.. యాబై శాతం వరకూ వరి కోతలు పూర్తయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

కుప్పల దగ్గరే పడిగాపులు

కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడవకుండా టార్పాలిన్ కవర్లు, పరదాలు కప్పుతున్నారు రైతులు. ఎప్పుడు జల్లులు పడతాయోనని ఇతర పనులకు వెళ్లకుండా కుప్పల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం కుప్పలపై పరదాలు తీయడం, మబ్బులు వచ్చినపుడు కప్పడం అలవాటుగా మారిందంటున్నారు. వర్షాలకు పొలాల్లో నీరు నిలవడంతో మిగిలిన వరి  కోతలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంలో తేమ అధికంగా ఉందంటూ అధికారులు ఇబ్బందులు పెండుతున్నారని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేస్తే, తమకు ఈ ఇబ్బందులు వచ్చేవి కావంటున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా కాంటా పెట్టాలని డిమాండ్​ చేస్తున్నారు.