పోతిరెడ్డి పాడుపై రైతుల పోరుబాట

పోతిరెడ్డి పాడుపై రైతుల పోరుబాట

ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేడు సుప్రీంలో పిటిషన్

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెగ్యులేటర్ కెపాసిటీ పెంపు, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీమ్‌పై ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు పోరుబాట పడుతున్నారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులను ఆపాలంటూ బుధవారం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తున్నారు. అడ్వొకేట్ శ్రావణ్ కుమార్ ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ రెడీ చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ఏకపక్షంగా చేపడుతున్న ప్రాజెక్టులను ఆపాలంటూ సుప్రీం కోర్టును కోరనున్నారు. నారాయణపేట జిల్లా రైతులు, సర్పంచుల సంఘం ప్రతినిధులు పిటిషన్ వేస్తున్నట్టు తెలిపారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నీటిని అక్రమంగా తరలించేందుకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్‌లు తలపెట్టిందని పాలమూరు రైతులు చెప్తున్నారు. కృష్ణా నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు నిండక ముందే పెన్నా బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించేందుకు భారీ ప్రాజెక్టులు తలపెట్టిందని, వాటిని ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు, సీడబ్ల్యూసీకి, కేఆర్ఎంబీకి కంప్లైంట్ చేయడంతో పాటు సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. జీవో 203లోని ప్రాజెక్టులన్నీ అక్రమేనని, ఇవి పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమ మార్గాల్లో ఈ ప్రాజెక్టులకు అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు వాటిని అడ్డుకోకపోవడంతో ఈ విషయంలో అనేక అనుమానాలున్నాయని రైతులు అంటున్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో తామే న్యాయపోరాటానికి దిగుతున్నామని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసి స్టే వచ్చేందుకు ప్రయత్నించిన గవినోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే రైతులు పిటిషన్ వేస్తున్నారు.

కేంద్రానికి కంప్లైంట్ చేశాం
పూర్తిగా వెనుకబడ్డ పాలమూరు ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కెపాసిటి పెంపు, సంగమేశ్వరం ప్రాజెక్టులు మొదలు పెట్టింది. వీటితో మాకే కాదు మొత్తం దక్షిణ తెలంగాణకు నష్టం. అందుకే జిల్లాలోని సర్పంచులందరం మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వానికి, కేఆర్ఎంబీకి, ఏపీ జ్యూడిషల్ ప్రివ్యూకు ఈ ప్రాజెక్టులపై కంప్లైంట్ చేశాం. ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులు ఆపకపోతే మరిన్నిపోరాటాలు చేసేందుకు రెడీ ఉన్నాం.
– జి.సుభాష్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు,నారాయణపేట

ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవాలి
ఏపీ ప్రాజెక్టులు పూర్తయితే మా ప్రాంతానికి తీవ్ర నష్టం. కృష్ణా నదిపైన నిర్మించిన ప్రాజెక్టులకు చుక్క నీరు రాదని సీనియర్ ఇంజనీర్లు కూడా చెప్తున్నరు. ఇప్పటికే పాలమూరు కరువు ప్రాంతం. తెలంగాణ వచ్చిన దగ్గర్నుంచే చెరువుల్లో నీళ్లు కనిపిస్తున్నయి. ఏపీ ప్రాజెక్టులతో ఆ నీళ్లు కూడా రాయలసీమకు మళ్లిస్తారు. అప్పుడు తెలంగాణకు మరింత అన్యాయం జరుగుతుంది. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అందరం కలిసి అడ్డుకోవాలి.
– కె.భారతి సచిన్, సర్పంచ్, ఏంనోనిపల్లి, ధన్వాడ మండలం

మా బతుకేమైతదో
పాలమూరు ప్రాజెక్టు కడితే మాకు నీళ్లు వస్తయనుకున్నం. ఇగ మన రాష్ట్రంల నీళ్ల కరువు తీరుతదనుకున్నం. ఇప్పుడు ఏపీ ఏదో పెద్ద ప్రాజెక్టు కడుతుందట. ఇప్పటికే నీళ్లన్నీ ఏపీకే పోతున్నయి.. ఇది కూడా కడితే మా పాలమూరు రైతుల బతుకేమైపోవాలె.
-హన్మంతు, రైతు, పిడెంపల్లి గ్రామం

ప్రాజెక్టు కట్టమని ఎన్జీటీ చెప్పలే
ఎన్జీటీలో స్టే ఉండగానే ఏపీ సర్కార్ టెండర్ల ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఎవరు అడ్డుకుంటారనే ధీమా అక్కడి అధికారుల్లో కనిపిస్తోంది. పర్మిషన్ లేకుండా, విభజన చట్టం అతిక్రమించి ఈ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. దీనిపై బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తాం.
– గవినోళ్ల శ్రీనివాస్, రైతు, పిటిషనర్

దక్షిణ తెలంగాణ బీడువారుతది
ఏపీ భారీ లిఫ్ట్ కడుతోంది. అది కంప్లీట్ అయితే దక్షిణ తెలంగాణ మొత్తం బీడువారుతది. ఈ ప్రాజెక్టుతో నారాయణ పేట జిల్లాకు తీరని నష్టం. మన రాష్త్ర సర్కారు మౌనంగా ఉండటం సరికాదు. సుప్రీం కోర్టులో కేసు వేయాల్సిందే. -గౌని శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ, ధన్వాడ

For More News..

రెండో ఏడాదే కాళేశ్వరానికి రెస్ట్.. ఇంకా స్టార్ట్ కాని మోటర్లు

18 కోట్ల మందికి కరోనా వచ్చిపోయిందని కూడా తెలియదు

ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా