ఇబ్రహీంపట్నం, వెలుగు: హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లోకి జేసీబీలతో చొరబడ్డారంటూ.. అధికారులపై 41 మంది రైతులు, రైతు కూలీలు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం 19,333 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటుకు సంకల్పించి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 12 వేల ఎకరాల భూమిని సేకరించింది. అయితే, చాలా మంది రైతులు, రైతు కూలీలు హైకోర్టును ఆశ్రయించడంతో యథాస్థితి ఉత్తర్వులు జారీ చేసింది.
భూసేకరణ చట్టం ప్రకారం.. బలవంతపు చర్యలు చేపట్టవద్దంటూ స్టే విధించింది. ఈ నెల 2న ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు జేసీబీలతో అక్రమంగా తమ భూముల్లో చొరబడి పంటలు, చెట్లు, ఆస్తులను ధ్వంసం చేశారని రైతులు, రైతు కూలీలు ఆరోపించారు. విద్యుత్ కనెక్షన్ల కట్ చేస్తున్నారంటూ బుధవారం మేడిపల్లి గుడి నుంచి ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ తీసి, సీఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
