
- 16 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు
- ఈ సీజన్లో ఇప్పటి వరకు 30 శాతం పంటలు సాగు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో16.32 లక్షల ఎకరాల్లో రైతులు యాసంగి పంటలు వేశారు. కాగా సాధారణ యాసంగి సాగులో ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే సాగైందని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తాజాగా నివేదిక అందజేసింది. యాసంగిలో సాధారణ పంటల సాగు 54.93 లక్షల ఎకరాలు కాగా నిరుడు సీజన్ ముగిసే నాటికి 72.63 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. కాగా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 30 శాతం విస్తీర్ణంలో యాసంగి పంటలు సాగయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంతో పోలిస్తే ఇప్పటి వరకు అత్యధికంగా 76.78 శాతం పంటలు సాగవగా, నిజామాబాద్ జిల్లాలో 71.68 శాతం, నిర్మల్ జిల్లాలో 54.77 శాతం, నాగర్ కర్నూలు జిల్లాలో 49 శాతం పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా మెదక్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 2.51శాతమే రైతులు ఇప్పటి వరకు పంటలు వేశారు.
మిల్లెట్స్ వేయట్లేదు
మిల్లెట్స్ సాగుపై దృష్టి సారించాలని ప్రభుత్వం చెబుతున్నా, రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో చిరుధాన్యాల పంటల సాగు నామమాత్రంగానే ఉంటున్నది. సజ్జ పంట సాధారణ సాగు విస్తీర్ణం 22,967 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు కేవలం 46 ఎకరాల్లోనే రైతులు పంట వేశారు. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం1,02,026 ఎకరాలు కాగా ఇప్పటివరకు 55,463 ఎకరాల్లో పంట సాగు చేశారు. రాగులు 86 ఎకరాల్లో, కొర్రలు124 ఎకరాల్లో వేశారు.
వరి నాట్లు నెమ్మదిగా..
వరి యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 40.50 లక్షల ఎకరాలు కాగా, నిరుడు ఈ టైమ్‌కు7.71లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. కాగా ఈయేడు ఇప్పటి వరకు 7.62 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇది సాధారణ సాగులో18.84 శాతమే. మక్క సాధారణ సాగు విస్తీర్ణం 5.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.81 లక్షల ఎకరాల్లో సాగైంది. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 4.21లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.76 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.