V6 News

గాలి వాన బీభత్సం..రైతన్నల కష్టాలు.. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో తడిసిన వడ్లు

గాలి వాన బీభత్సం..రైతన్నల కష్టాలు.. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో తడిసిన వడ్లు
  • మెదక్‌‌‌‌ జిల్లాలో  పిడుగుపడి రైతు మృతి

రాజన్న సిరిసిల్ల/సిద్దిపేట, వెలుగు : సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులువీయడంతో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు నేలవాలగా.. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌‌‌‌ స్తంభాలు విరిగిపోయాయి. 

సిరిసిల్ల పట్టణంలోని గాంధీ నగర్‌‌‌‌లో ఓ ఇంటి గోడ కుప్పకూలడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వర్షం, వడగండ్ల కారణంగా సిద్దిపేట జిల్లాలో వడ్లు రాలిపోయాయి. సిద్దిపేట అర్బన్‌‌‌‌ మండలం నాంచారుపల్లి, మర్పడ్గలో రోడ్డుపై ఆరబోసిన వడ్లు కొట్టుకుపోగా, కిష్టసాగర్, ఎన్సాన్‌‌‌‌పల్లిలో వడ్లు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల రాశుల మధ్య నీరు నిల్వ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట మార్కెట్‌‌‌‌యార్డులో ఆరబెట్టిన వడ్లు, మక్కలు తడిసిపోయాయి. 

పిడుగు పడి వడ్ల కుప్పమీద   ప్రాణాలొదిలిన రైతు

మెదక్, వెలుగు : మెదక్‌‌‌‌ జిల్లా హవేలీ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపడడంతో ఓ రైతు వడ్ల కుప్పపైనే ప్రాణాలొదిలాడు. గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్‌‌‌‌ (42) వడ్లను బూరుగుపల్లి – వాడి రహదారిపై పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ స్థలంలో కుప్పగా పోశాడు. గురువారం వడ్లను ఆరబెడుతుండగా పిడుగు పడడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు.