ఇండ్లు భూములు పోయినయ్

ఇండ్లు భూములు పోయినయ్

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: “ప్రాజెక్టు కోసం ఇండ్లిచ్చినం.. భూములిచ్చినం.. పరిహారం ఇయ్యకున్నా ఏండ్ల సంది ఓపిక పడితే పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా పనులు జేస్తరా.. మాకు రావాల్సిన పైసలు ఇచ్చినంకనే ప్రాజక్టు పనులు చేసుకోండి’’అంటూ.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. దాదాపు 8 గంటలకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న నిర్వాసితులపై పోలీసులు లాఠీ ఛార్జ్​చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలువురికి గాయాలయ్యాయి. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు దాదాపు 200 మంది పోలీసుల సాయంతో అధికారులు గుడాటిపల్లి, సోమాజీ తండా రోడ్లను జేసీబీలతో తవ్వడం ప్రారంభించారు. గుడాటిపల్లితో పాటు సమీప తండాల నుంచి పెద్ద ఎత్తున్న నిర్వాసితులు అక్కడికి చేరుకుని పనులను అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు.. నిర్వాసితుల మధ్య తోపులాటలు జరిగాయి. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నిర్వాసితులపై లాఠీ చార్జ్​చేశారు. దీంతో పలువురు నిర్వాసితులు తీవ్రంగా గాయపడ్డారు. పెండింగ్​పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్​చేశారు. ఇప్పటికే బోర్లు, బావులకు త్రీఫేజ్ కరెంటు కట్ చేశారని, పరిహారం ఇవ్వకుండా పోలీసులతో బెదిరించడం ఏంటని అధికారులను నిలదీశారు. పనులు ప్రారంభించిన చోటనే  నిర్వాసితులు భైఠాయించారు. నిర్వాసితులు ఒక వైపు కూర్చోగా మరో వైపు పోలీసులు మోహరించారు. దాదాపు ఎనిమిది గంటలకు పైగా నిర్వాసితులు, పోలీసులు అక్కడే మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. సీఎం డౌన్ డౌన్ అంటూ నిర్వాసితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. న్యాయంగా పరిహారం ఇవ్వాలని కోరుతుంటే పట్టించుకోకుండా పోలీసులతో కొట్టించి పనులు చేయడం పట్ల పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆందోళన చేస్తున్న నిర్వాసితుల దగ్గరకు రెవెన్యూ ఆఫీసర్లు ఎవరూ రాలేదు. ప్రాజెక్టు వద్ద తిరిగి పనులు ప్రారంభిస్తారనే అనుమానంతో నిర్వాసితులు రాత్రి 8 గంటల సమయంలో  అక్కడే పొయ్యిలు ఏర్పాటు చేసి చలిలోనే వంటా వార్పు 
ప్రారంభించారు.

నిర్వాసితులపై పోలీసుల ఓవరాక్షన్
గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్ వల్లే పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారి తీశాయి. మొదట శాంతియుతంగా ఆందోళనకు సిద్ధమైన నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో నిర్వాసితులు  ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు దూసుకుపోయారు. సీఐ రఘుపతి రెడ్డి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బూతు మాటలు మాట్లాడటంతో నిర్వాసితుల్లో మరింత ఆగ్రహం పెరిగింది. పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతో పోలీసులు లాఠీలు ఝలిపించడంతో పలువురు నిర్వాసితులు గాయపడ్డారు. అనేక మంది బట్టలు సైతం చిరిగిపోయాయి. గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అనే యువకుడి తలకు దెబ్బతగిలింది. మహిళలపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో హుస్నాబాద్ఎస్ఐ శ్రీధర్ తలకు కూడా దెబ్బ తగిలింది. పనులను అడ్డుకుంటున్నారంటూ, ఎస్సై గాయపడటానికి కారణమయ్యారంటూ.. అక్కన్నపేట పోలీసులు గుడాటిపల్లి నిర్వాసితులు13 మందిపై కేసులు నమోదు చేశారు.