పరిహారం రాకపోవడంతో సెల్​ టవర్ ఎక్కి రైతుల నిరసన

పరిహారం రాకపోవడంతో సెల్​ టవర్ ఎక్కి రైతుల నిరసన

చేవెళ్ల, వెలుగు : టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్కు కోసం నిరుడు భూములు ఇచ్చామని, ఇప్పటిదాకా నష్టపరిహారం ఇవ్వలేదని రంగారెడ్డి జిల్లా షాబాద్​ మండలం చందన్​వెల్లి రైతులు ఆందోళన చేపట్టారు. పరిహారం ఇవ్వకుంటే భూములు తిరిగి ఇచ్చేయాలంటూ హైతాబాద్​లోని సెల్​ఫోన్​ టవర్​ఎక్కి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న షాబాద్ సీఐ గురువయ్యగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికుమార్ అక్కడికి చేరుకుని భూ నిర్వాసితులతో మాట్లాడారు.

చేవెళ్ల ఆర్డీవో వచ్చి హామీ ఇచ్చేదాకా కిందికి దిగమంటూ తేల్చిచెప్పారు. కలెక్టర్, అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో రైతులు టవర్ దిగారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. చందన్​వెల్లి, హైతాబాద్ గ్రామాల నుంచి ప్రభుత్వం భూమి సేకరించిందన్నారు. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, బలవంతంగా భూములు గుంజుకుని పరిహారం ఇవ్వకుండా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జాదారులకు, అక్రమార్కులకు పరిహారం ముందే చెల్లించి.. అర్హులైన తమను నట్టేట ముంచారని విమర్శించారు.