ధాన్యం కొనుగోలు జాప్యం.. రైతుల ఆగ్రహం

ధాన్యం కొనుగోలు జాప్యం.. రైతుల ఆగ్రహం

ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు చేస్తు్న్నారు. మే 31వ తేదీ బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహించారు.దీంతో రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి -పరకాల ప్రధాన రహదారిపై రైతుల ఆందోళనకు దిగారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన రైతన్నలు..సాకులు చెప్పకుండ వెంటనే ధాన్యం కొనుగోలు చేయలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు

మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు తీసుకెళ్లిన ధాన్యాన్ని  ప్రైవేట్ కొనుగోలుదారులకు నష్టానికి అమ్ముకుంటున్నారు రైతులు. సూరయ్యపల్లి గ్రామానికి చెందిన ఓదెలు అనే రైతు గత ముప్పై రోజులుగా మార్కెట్ యార్డ్ లోనే ధాన్యం కొనుగోలు చేస్తారని వేచి చూసి విసుగు చెందాడు. దీంతో ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేందుకు సిద్ధమైయ్యాడు. 30 రోజుల్లో మూడుసార్లు వర్షాలు పడి తన ఏడెకరాల పంటలో సుమారు ఒక ట్రాక్టర్ లోడ్ వడ్లు నీళ్లలో కొట్టుకుపోయాయని ఆతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

నిర్మల్ జిల్లా  సిర్గాపూర్ గ్రామ జాతీయ రహదారిపై రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ నేతలు, రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, తూకం పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.