శివ్వంపేట, వెలుగు: రికార్డులు తారుమారు చేసి తమ భూమిని మరొకరి పేరు మీద మార్చి అన్యాయం చేశారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యా తండాకు చెందిన గిరిజన రైతులు శుక్రవారం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నేలపై పడుకొని నిరసన తెలిపారు. తమ తండ్రి బద్రియా 2020లో చనిపోగా, అతని పేరు మీద ఉన్న సర్వే నంబర్ 315/37/2లో ఉన్న 2 ఎకరాల -38 గుంటల భూమిని హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు మీద మార్చారని బద్రియా కొడుకులు మునిరాం, చందర్, బాల్ సింగ్, లక్ష్మణ్. శివ లాల్ ఆరోపించారు. తమ తాత, తండ్రుల కాలం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా మరొకరి పేరు మీద మార్చి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదేళ్లుగా తాము న్యాయ చేయాలంటూ తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. తహసీల్దార్ ను ఆఫీస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పక్కకు జరిపారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కమలాద్రి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
