- వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
నల్గొండ, వెలుగు: ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే వడ్లు సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎన్.కోదండ రెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్లు అమ్మిన తర్వాత మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రైతులను రైస్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాల బావి, ఎస్ఎల్ బీసీ మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం నల్గొండ కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో రివ్యూ చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులు, సాదా బైనామాల వివరాలను కలెక్టర్ బి. చంద్రశేఖర్ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కోదండ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలసీకి విరుద్ధంగా వడ్ల సేకరణ చేయవద్దని, రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం ఉండవద్దని, రైతు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు మాత్రమే సంబంధం ఉంటుందని స్పష్టం చేశారు.
తాలు, తరుగు, తేమకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కొనుగోలు కేంద్రంలోనే చూసుకోవాలన్నారు. తాలు, తరుగు, తేమ, హమాలీ పేరుతో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఇలాంటివి ఉండవద్దన్నారు. మిల్లర్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, గోపాల్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్ ఉన్నారు.

