రుణమాఫీ మరిచిన సర్కారు క్రాప్ ​లోన్లకు కష్టకాలం

రుణమాఫీ మరిచిన సర్కారు క్రాప్ ​లోన్లకు కష్టకాలం

మంచిర్యాల, వెలుగు: వానాకాలం సీజన్​ షురువైంది. నైరుతి రుతుపవనాల రాకతో తొలకరి వానలు పడుతున్నాయి. రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. పత్తి విత్తనాలు నాటుతున్నారు. మరో రెండు వానలు పడితే నార్లు పోసేందుకు రెడీ అవుతున్నారు. అయితే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర పెట్టుబడుల కోసం మాత్రం తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం, బ్యాంకర్ల తీరుతో టైమ్​కు క్రాప్​లోన్లు అందక పరేషాన్​ అవుతున్నారు.  

రుణమాఫీ ఎప్పుడు? 

రైతులకు రూ.లక్ష లోపు క్రాప్​లోన్లు మాఫీ చేస్తామని గత ఎన్నికల టైంలో టీఆర్ఎస్​ సర్కారు హామీ ఇచ్చింది. ఏటా రూ.25వేల చొప్పున నాలుగు విడతల్లో రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తామని పేర్కొన్నది. 2020లో మొదటి విడతలో రూ.25వేల లోపు, 2021లో రెండో విడతలో రూ.50వేల లోపు రుణాలను మాఫీ చేసింది. అది కూడా కొంతమంది రైతులకు మాత్రమే. రూ.50వేల నుంచి రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్​ వచ్చినా ప్రభుత్వం రుణమాఫీ ఊసెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 

పాత అప్పు కడితేనే ఇస్తరట 

ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులకు క్రాప్ ​లోన్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. పాత అప్పు కడితేనే కొత్త లోన్లు మంజూరు చేస్తామని షరతు పెడుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసిన తర్వాత కట్టిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు. కానీ ఆ పైసలు వడ్డీలకే సరిపోతాయని రైతులంటున్నారు. మరోవైపు బ్యాంకర్లు రైతులను డిఫాల్టర్ల కింద జమ కడుతున్నారు. దీంతో పలువురు క్రాప్​ లోన్లు రెన్యువల్​చేసుకుంటున్నారు. రైతులు వడ్డీ చెల్లిస్తే బ్యాంకర్లు కొత్తగా లోన్లు ఇచ్చి ఆ మొత్తాన్ని పాత బాకీ కింద వసూలు చేసుకుంటున్నారు. దీంతో రైతులకు మిగిలేదేమీ ఉండడం లేదు. పెట్టుబడుల కోసం మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదని వాపోతున్నారు.   

ఆర్బీఐ రూల్స్​తో ఇబ్బందులు

ప్రభుత్వం ఏటేటా స్కేల్​ఆఫ్​ఫైనాన్స్​మొత్తాన్ని పెంచుతోంది. కానీ ఆ మేరకు క్రాప్​ లోన్లు తీసుకోవడానికి ఆర్​బీఐ రూల్స్​ అడ్డొస్తున్నాయి. కొలేటర్​ఫ్రీ రుణ పరిమితిని ఆర్​బీఐ 2010లో రూ.లక్షగా నిర్ణయించింది. అంతకుముందు ఇది రూ.50వేలు మాత్రమే. దీనిని 2019లో రూ.1.60 లక్షలకు పెంచింది. అంటే రూ.1.60 లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు. అంతకంటే ఎక్కువ లోన్​ తీసుకోవాలంటే రైతు తన భూమిని బ్యాంక్​కు మార్ట్​గేజ్​ చేయాల్సి ఉంటుంది. రాష్ర్ట ప్రభుత్వ నిబంధల ప్రకారం రూ.2లక్షల లోన్​కు రూ.200 విలువైన స్టాంపింగ్​తో పాటు మరో ఇద్దరు రైతుల ష్యూరిటీ అవసరం.  పెరిగిన పెట్టుబడి, చాలీచాలని లోన్లు, పెరుగుతున్న ధరల కారణంగా పంటల పెట్టుబడి ఖర్చు కూడా పెరుగుతోంది. రాష్ర్టంలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి, వరి పంటలను సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో పత్తి ఎకరానికి రూ.రూ.38వేల నుంచి రూ.40వేలు, వరి ఎకరానికి రూ.36 వేల నుంచి రూ.40వేల రుణ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ఐదెకరాల్లో పత్తి సాగు చేసే రైతుకు రూ.2లక్షల క్రాప్​ లోన్​ఇవ్వాలి. కానీ ఆర్​బీఐ రూల్స్​ ప్రకారం బ్యాంకర్లు కొలేటర్​ ఫ్రీ లోన్​ రూ.1.60 లక్షలోపే మంజూరు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ లోన్​ కావాలంటే రైతు తన భూమిని మార్ట్​గేజ్​చేయాలని కోరుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో మార్ట్​గేజ్​ కాకుండా రూ.200 స్టాంపింగ్​తో పాటు మరో ఇద్దరు రైతుల ష్యూరిటీ అడుగుతున్నారు. ఇది రిస్క్​తో కూడిన వ్యవహారం కావడంతో బ్యాంకులు ఇచ్చినంత తీసుకొని మిగతా పెట్టుబడి మిత్తికి తెచ్చుకుంటున్నారు. దీంతో ఆర్​బీఐ కొలేటర్​ ఫ్రీ పరిమితిని పెంచాలని రైతులు 
కోరుతున్నారు.  

4 లక్షల మందికే ఇచ్చిన్రు

రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు.. లక్ష లోపు పంటరుణాలను మూడేండ్లలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 2018 డిసెంబరు 11ను కటాఫ్ తేదీగా నిర్ణయించి, అప్పటివరకు ఉన్న క్రాప్ లోన్లు( వడ్డీ, అసలు కలిపి) రూ.లక్ష వరకు తానే చెల్లిస్తానని చెప్పింది. స్టేట్​వైడ్ 40.66 లక్షల  రైతులకు సంబంధించి రూ.25,936 కోట్ల క్రాప్​లోన్స్​ ఉండగా, ఇప్పటివరకు కేవలం 4 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.732.24 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించి 25,203 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. రూ.25వేల లోపు లోన్లను పూర్తిగా మాఫీ చేసినప్పటికీ  ప్రస్తుతం పెండింగ్ పెట్టిన రుణాలన్నీ రూ.50వేలు ఆపైన ఉన్నవే. ఈ లోన్లను ఏడాదికోసారి వడ్డీ కట్టి  రెన్యువల్​చేసుకోవాల్సి వస్తోంది.