కోరిక తీర్చలేదని.. వాచ్​మన్​తో పాటు అతడి భార్య అరెస్ట్

కోరిక తీర్చలేదని.. వాచ్​మన్​తో పాటు అతడి భార్య అరెస్ట్

చేవేళ్ల, వెలుగు: ఆరు రోజుల కిందట చేవెళ్లలోని ఫాంహౌస్​లో జరిగిన మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఫాంహస్ లో పని ఇప్పిస్తామని మహిళను తీసుకొచ్చిన వాచ్ మన్.. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితుడితో పాటు అతడి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం చేవెళ్ల పీఎస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ లక్ష్మారెడ్డి, ఎస్సై వీరబ్రహ్మం వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మద్గుల్ చిట్టెంపల్లికి చెందిన శివనీల(28) పదేండ్ల కిందట భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటూ కూలిపని చేస్తోంది.

చేవెళ్లలోని భగత్ సింగ్ నగర్ లో ఓ రూమ్​లో రెంట్​కు ఉంటోంది. చేవెళ్లలో ఉడిపి హోటల్ నడుపుతున్న సంపత్​తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గురువారం వీరిద్దరు కలిసి మొయినాబాద్​లోని కల్లు దుకాణానికి వెళ్లారు. ఆరాంఘర్​కు చెందిన సత్యం, కల్పన దంపతులు చేవెళ్ల శివార్లలోని ఓ ఫాంహౌస్​లో వాచ్​మన్ గా పనిచేస్తున్నారు. కల్లు దుకాణం వద్ద సంపత్, శివనీలకు వీళ్లు పరిచయం అయ్యారు. ఫాంహౌస్ లో పని ఇప్పిస్తామని సత్యం, కల్పన దంపతులు సంపత్, శివనీలను అదేరోజు సాయంత్రం ఫాంహౌస్​కు తీసుకెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న మద్యాన్ని అందరూ తాగారు. కల్లు తాగిన కల్పన తొందరగా నిద్రపోయింది. శివనీలపై కన్నేసిన సత్యం.. ప్లాన్ ప్రకారం మద్యం తీసుకురమ్మని చెప్పి సంపత్​ను బయటికి పంపించాడు.

ఆ తర్వాత తన కోరిక తీర్చాలంటూ శివనీలపై ఒత్తిడి తెచ్చాడు. సత్యంను పక్కకు తోసి  ఆమె పారిపోతుండగా.. అతడు కర్రను విసిరాడు. తలకు కర్ర తగిలి కిందపడ్డ శివనీల ఏడుస్తుండటంతో తన భార్య నిద్ర లేస్తోందేమోననే భయంతో సత్యం అదే కర్రతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. తర్వాత శివనీల మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. కొద్దిసేపటికి మద్యం తీసుకుని ఫాంహౌస్ వైపు వస్తున్న సంపత్​ను దూరం నుంచే గమనించిన సత్యం అతడికి ఎదురెళ్లాడు. శివనీల వెళ్లిపోయిందని చెప్పి అతడిని కూడా అక్కడి నుంచి పంపించాడు. తిరిగి ఫాంహౌస్​కు చేరుకున్న సత్యం.. శివనీల డెడ్​బాడీని ఫాంహౌస్​లోని రూమ్ ముందు గొయ్యి తీసి అందులో పాతిపెట్టాడు. దానిపై బండలు పరిచాడు.

ఉదయం నిద్రలేచిన కల్పనకు జరిగిన విషయం చెప్పాడు. అక్కడే ఉంటే పోలీసులకు దొరికిపోతామని భావించిన సత్యం, కల్పన దంపతులు..  తాము పనిమానేస్తున్నామని ఓనర్​కు చెప్పి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఫాంహౌస్​కు వచ్చిన మల్లారెడ్డి.. వాచ్​మన్ రూమ్ ముందు బండలు సరిగా లేకపోవడాన్ని గమనించాడు. బండలను పక్కకు జరిపి చూడగా శివనీల చీర కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మట్టిని తవ్వి శివనీల డెడ్ బాడీని బయటికి తీశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టి పరారీలో ఉన్న సత్యం, కల్పనను అరెస్ట్ చేశారు.