బడ్జెట్​తో మార్కెట్​కు లింకు కుదరట్లే

బడ్జెట్​తో మార్కెట్​కు  లింకు కుదరట్లే
  • బీ-డే తర్వాతి వారంలో ఎక్కువ సార్లు పడిన సెన్సెక్స్‌‌
  • గత 7 పూర్తి ఏడాది బడ్జెట్లలో నాలుగు సార్లు క్రాష్‌‌..3 సార్లే ర్యాలీ
  • ఈ సారి బడ్జెట్‌‌ చారిత్రాత్మకంగా ఉంటుంది: ఎనలిస్టులు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: స్టాక్‌‌ మార్కెట్లకు బడ్జెట్‌‌ తర్వాతి వారం కలిసి రావడం లేదు. మోడీ గవర్న్‌‌మెంట్‌‌ ఇప్పటి వరకు ఏడు పూర్తి ఏడాది బడ్జెట్‌‌లను ప్రవేశ పెట్టింది. నాలుగు సార్లు బడ్జెట్‌‌ తర్వాతి వారంలో సెన్సెక్స్‌‌ 4 శాతం వరకు నష్టపోగా, మూడు సార్లు ఏడు శాతం వరకు లాభపడింది. బడ్జెట్‌‌20‌‌‌‌20 కు ముందు వారం ఈ బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌ భారీగా పతనమయ్యింది. బడ్జెట్‌‌ రోజే 2.42 శాతం వరకు క్రాష్‌‌ అయ్యింది. అయినప్పటకీ బడ్జెట్ ప్రకటించిన తర్వాత మార్కెట్లో కొనుగోళ్లు పెరిగాయి. తర్వాత ఐదు సెషన్లలోనే సెన్సెక్స్ 3.53 శాతం ర్యాలీ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌  ఫిబ్రవరి 1, 20‌‌‌‌20 న ఈ బడ్జెట్‌‌ను ప్రవేశ పెట్టారు.

1) మోడీ ప్రభుత్వం 2.0 లో మొదటి బడ్జెట్‌‌ను 2019 , జులై 5 న సీతారామన్‌‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌‌ రోజే సెన్సెక్స్‌‌ 0.9 శాతం నష్టపోయింది. మొత్తంగా బడ్జెట్‌‌కు ముందు వారంలో 0.3 శాతం స్వల్ప లాభాన్ని సెన్సెక్స్ నమోదు చేసింది. కానీ బీ–డే(బడ్జెట్ డే) తర్వాతి వారంలో 1.96 శాతం క్రాష్ అయ్యింది.

2) ఫిబ్రవరి 1, 2018 న అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌‌ జైట్లీ యూనియన్‌‌ బడ్జెట్‌‌ను ప్రవేశ పెట్టారు. ఆ తర్వాతి వారంలో సెన్సెక్స్‌‌ 4.16 శాతం పతనమయ్యింది. దీనికి అదనంగా బడ్జెట్‌‌కు ముందటి వారంలో 0.7 శాతం నష్టపోయింది.

3)  బడ్జెట్‌‌ 2017–18 కు ముందు వారంలోనే సెన్సెక్స్‌‌ 2.8 శాతం పెరిగింది. బడ్జెట్‌‌ తర్వాతి వారంలో మరో 0.53 శాతం లాభపడింది.

4) 2016 లో మొదటి సారిగా యూనియన్‌‌ బడ్జెట్‌‌ను ఫిబ్రవరి 1 న ప్రవేశ పెట్టారు. బీ–డేకు ముందటి వారంలో సెన్సెక్స్‌‌ 3.3 శాతం నష్టపోగా, బడ్జెట్ తర్వాతి వారంలో 7.2 శాతం ర్యాలీ చేసింది. గత 7 ఏళ్ల బడ్జెట్‌‌ ర్యాలీలలో ఇదే ఎక్కువ కావడం విశేషం.

5) బడ్జెట్‌‌ 2015–16 పై అంచనాలెక్కువగా ఉండడంతో బీ–డేకు ముందటి వారంలో సెన్సెక్స్‌‌ 1.33 శాతం ఎగిసింది. కానీ తర్వాత ఈ లాభాలను కోల్పోయింది. బడ్జెట్ తర్వాతి వారంలో సెన్సెక్స్‌‌ 1.76 శాతం పతనమైంది.

6) మోడీ గవర్న్‌‌మెంట్‌‌ తన మొదటి బడ్జెట్‌‌ను 2014 జులై 10 న ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్‌‌కు ముందు వారంలో సెన్సెక్స్‌‌ 1.75 శాతం నష్టపోగా, తర్వాతి వారంలో 0.74 శాతం లాభపడింది.

‘గతంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లు మార్కెట్లకు నిరాశ కలిగించినా, 2021–22 బడ్జెట్‌‌ ‘ల్యాండ్‌‌ మార్క్‌‌’ గా ఉంటుందని ఫైనాన్స్ మినిస్టర్‌‌‌‌ హామీ ఇచ్చారు. ల్యాండ్ మార్క్ కాకపోయినప్పటికీ, కరోనా దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన ఎకానమీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ బడ్జెట్‌‌ చారిత్రాత్మకంగా ఉండొచ్చు. అభివృద్ధి చెందిన చాలా దేశాలతో పోలిస్తే కరోనాను ఇండియా బాగా కట్టడి చేయగలిగింది. దీనికయిన ఖర్చులను ప్రభుత్వం సులభంగా మేనేజ్ చేయగలదు’ అని యాక్సిస్‌‌ సెక్యూరిటీస్‌‌ పేర్కొంది.  క్యాపిటల్ ఎక్స్‌‌పెండెచర్‌‌‌‌ను పెంచడంపై ఆర్థిక మంత్రి స్పష్టంగా ఉన్నారని తెలిపింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న బడ్జెట్‌‌ కన్‌‌స్ట్రక్టివ్‌‌(నిర్మాణాత్మకం) గా ఉండొచ్చు. ట్యాక్స్ కలెక్షన్ అంచనాల కంటే మెరుగ్గా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ద్రవ్యలోటు అనుకూలంగా లేదు’  అని ఈ బ్రోకరేజి పేర్కొంది.

కొనసాగుతున్న మార్కెట్‌‌‌‌ క్రాష్‌‌‌‌..

ఇండియన్ స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. వరుసగా ఐదో సెషన్‌‌‌‌లోనూ మార్కెట్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకం దారులుగా మారడంతో గురువారం సెషన్‌‌‌‌లో సెన్సెక్స్‌‌‌‌ 536 పాయింట్లు నష్టపోయి 46,874 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 150 పాయింట్లు పడి 13,818 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్‌‌‌‌ 2,918 పాయింట్లు పతనమైంది. గ్లోబల్‌‌‌‌ మార్కెట్లు నెగెటివ్‌‌‌‌లో ట్రేడవుతుండడంతో బడ్జెట్‌‌‌‌కు ముందు ఇండియన్ మార్కెట్లు నష్టపోతున్నాయని జియోజిత్‌‌‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ వినోద్‌‌‌‌ నాయర్ అన్నారు. యూఎస్ ఫెడ్‌‌‌‌ వడ్డీ రేట్లను జీరో దగ్గరనే కొనసాగించినప్పటికీ మార్కెట్లు నష్టపోయాయని చెప్పారు. షాంఘై, హాంకాంగ్‌‌‌‌, సియోల్‌‌‌‌, టోక్యో మార్కెట్లు నష్టాల్లో క్లోజయ్యాయి. యూరప్ స్టాక్ ఎక్స్చేంజ్‌‌‌‌లు రెడ్‌‌‌‌లో ఓపెన్ అయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి 13 పైసలు బలహీనపడి 73.05 వద్ద క్లోజయ్యింది. బ్రెంట్‌‌‌‌ క్రూడ్ 0.27 శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌ 55.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.