డీమార్ట్ లాభం రూ.656 కోట్లు.. వార్షికంగా 19 శాతం పెరుగుదల

డీమార్ట్ లాభం రూ.656 కోట్లు.. వార్షికంగా 19 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: రిటైలర్​ డీమార్ట్ ఆపరేటర్ అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​ ఫలితాల్లో రూ.656.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్​లో వచ్చిన రూ.550.90 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం ఎక్కువ.  ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.17,684 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ.14,872 కోట్లుగా ఉంది. నాలుగో క్వార్టర్​లో కంపెనీ నిర్వహణ పనితీరు పటిష్టంగా ఉంది. ఎబిటా 26.7 శాతం పెరిగి రూ.1,210.5 కోట్లుగా నమోదైంది. 

మార్జిన్లు కూడా 6.42 శాతం నుంచి 6.85 శాతానికి మెరుగుపడ్డాయి. నాలుగో క్వార్టర్​లో కంపెనీ 58 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం డీమార్ట్ స్టోర్ల సంఖ్య 500 మార్కును దాటింది. నెట్ ప్రాఫిట్‌ మార్జిన్ 3.7 శాతంగా స్థిరంగా ఉంది.  2026 ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఆదాయం రూ.66,968 కోట్లుగా ఉంది. ఎబిటా 15.7 శాతం పెరిగి రూ.5,255 కోట్లకు చేరింది. నికర లాభం రూ.3,224 కోట్లుగా నమోదైంది.