పెంచుతం..కాదు కాదు పెంచం! పెట్రో ధరల పెంపుపై లీకులిస్తూనే, మరోవైపు లేదంటూ ఖండనలు

పెంచుతం..కాదు కాదు పెంచం! పెట్రో ధరల పెంపుపై లీకులిస్తూనే, మరోవైపు లేదంటూ ఖండనలు

న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. దీని గురించి స్పష్టంగా ఏ విషయమూ చెప్పకుండా దాటవేత ధోరణి అవలంభిస్తోంది. కొన్ని అధికార వర్గాలేమో పెంపు తప్పదని, మరికొన్నేమో అలాంటిదేమీ లేదని చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా ఇంధన ధరల పెంపు తప్పనిసరని తెలుస్తోంది. 

పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డొమెస్టిక్​ ఎల్​పీజీ సిలిండర్ ధర కూడా రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశం ఉంది.  అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా చెప్పకుండా లీకులిస్తోంది. దీంతో గందరగోళం నెలకొంది. ధరలు పెరుగుతున్నాయంటూ వచ్చిన వార్తలను కేంద్రానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కొట్టిపారేసింది.

కేంద్ర ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులు ఏవీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. పెట్రోలియం శాఖ పేరుతో చెలామణి అవుతున్న ఆ ఉత్తర్వులు నకిలీవని కేంద్రం తెలిపింది. ప్రభుత్వం అధికారికంగా ధరల పెంపుపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల భారం వేయడం తప్పదని లీకులు అందుతున్నాయి. 

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సరఫరా సజావుగా సాగాలంటే ధరల సవరణ అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సామాన్యులపై ఈ భారం ఏమేరకు ఉంటుందో వేచి చూడాలి. ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.  అసలైన ధరల వివరాలు కొన్ని రోజుల్లోనే వెల్లడి కానున్నాయి.