
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకవచ్చిన లారీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్ నడుపిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మెడిసిటీ కాలేజీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న హనుమకొండకు చెందిన ఎస్లావత్ అనూష (20) కుత్బుల్లాపూర్‌కు చెందిన తన స్నేహితుడు మహేశ్వర్ రెడ్డితో కలిసి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు బైక్‌పై వెళ్తుంది.
ఈ క్రమంలో మేడ్చల్‌లోని ఆక్సిజన్ పార్క్ బస్ స్టాప్ సమీపంలోకి రాగానే వేగంగా , నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడిపోయారు. దీంతో లారీ అనుష మీదినుంచి దూసుకెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడగా.. మేడ్చల్‌లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ అతడు కూడా చనిపోయాడు.
లారీ డ్రైవర్ అతివేగం , నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని.. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ అవుతుందనుకున్న బిడ్డ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అనూష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.