తుక్కు డబ్బాలు కొనేందుకు వెళ్లి… పేలుడులో తండ్రీ కొడుకుల మృతి

తుక్కు డబ్బాలు కొనేందుకు వెళ్లి… పేలుడులో తండ్రీ కొడుకుల మృతి

పేలుడు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసులు
కృష్ణా జిల్లా: ప్లైవుడ్ ఫ్యాక్టరీలో తుక్కు డబ్బాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తండ్రీ కొడుకులు అక్కడ జరిగిన పేలుడు ధాటికి కన్నుమూశారు. పేలుడు ధాటికి ఇద్దరి శరీర భాగాలు ముక్కలు చెక్కలై ఎగిరిపడ్డాయి. తండ్రీ కొడుకులు కోటేశ్వరరావు, చిన్నారావులు అక్కడికక్కడే కన్నుమూశారు. కొడుకు చిన్నారావు శరీర భాగాలు పైకప్పుగా ఉన్న రేకులపై ఎగిరిపడగా.. తండ్రి శరీర భాగాలు 50 అడుగుల దూరం ఎగిరిపడ్డాయి. పైకప్పు కూడా కూలిపోయింది. గన్నవరం మండలం సూరంపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది.
విజయవాడ రూరల్ మండలం పరిధిలోకి కండ్రిగ గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులిద్దరు సూరంపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లొని జయరాజ్ ఎంటర్ ప్రైజెస్ ప్లైవుడ్ ఫ్యాక్టరీ లో ఉదయమే స్క్రాప్ కొనుగోలు కింద తుక్కు డబ్బాలు కొనేందుకు వెళ్లారు. లోపలికి వెళ్లి ఖాళీ డబ్బాలు నిల్వ ఉంచిన ప్రాంగణం వైపు వెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి వీరిద్దరి శరీర భాగాలు ముక్కలు చెక్కలై.. షాపు నుంచి 50 అడుగుల దూరం వరకు ఎగిరి పడ్డాయి. హఠాత్తుగా జరిగన ఘటన కలకం రేపింది. పెద్ద శబ్దంతో పేలుడు జరగడం.. ఇద్దరు వ్యక్తుల శరీర భాగాలు ఎగిరిపడ్డడం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫైరింజన్ సిబ్బంది వచ్చి పేలుడు జరిగిందని.. గుర్తించారు. మంటలు చెలరేగలేదని గుర్తించి ముందు జాగ్రత్తలు చేపట్టారు. ఏ పదార్ధం వల్ల పేలుడు సంభవించిందో.. ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రప్పించారు.