గంజాయికి బానిసై వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి

గంజాయికి బానిసై వేధిస్తున్నాడని  కొడుకును చంపిన తండ్రి
  •     నరికేసిన గొడ్డలితో వెళ్లి పోలీసులకు సరెండర్​
  •     నిజామాబాద్ ​జిల్లా నల్లవెల్లిలో ఘటన

నిజామాబాద్, వెలుగు:  గంజాయి మత్తుకు బానిసగా మారి ఇంట్లోవాళ్లను వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపేశాడు. నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయం చేసుకునే కొత్తగొల్ల కిషన్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు  భానుచందర్ ప్రైవేట్ బస్ కండక్టర్​గా పనిచేస్తుండగా చిన్న కొడుకు కొత్తగొల్ల భానుప్రకాశ్​(23) గంజాయికి అలవాటుపడి ఖాళీగా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా మత్తులో తూలుతూ డబ్బుల కోసం ఇంట్లో గొడవ పడేవాడు. అతన్ని మార్చడానికి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గంజాయికి బానిస కావడంతో పెండ్లి కూడా కావడంలేదు. తండ్రి మందలించినప్పుడల్లా అతనిపైకే దాడికి వెళ్లేవాడు. బుధవారం రాత్రి మత్తులో తూలుతూ ఇంట్లో హంగామా చేసి సోయిలేకుండా నిద్రలోకి జారుకున్నాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన తండ్రి కొత్తగొల్ల కిషన్ గురువారం ఉదయం నిద్రిస్తున్న కొడుకును గొడ్డలితో నరకగా అక్కడికక్కడే చనిపోయాడు. తరువాత కిషన్​గొడ్డలితో సహా ఇందల్వాయి పోలీసు స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు.