రామగుండంలో స్పీడందుకున్న ఎరువుల తయారీ

రామగుండంలో స్పీడందుకున్న ఎరువుల తయారీ
  • ప్రతిరోజూ 3 వేల టన్నుల యూరియా, 2,100 టన్నుల అమోనియా ప్రొడక్షన్​ 
  • ఏటా13 లక్షల మెట్రిక్‌‌ టన్నులు లక్ష్యం
  • తెలంగాణకు 46 శాతం కేటాయింపులు
  • కిసాన్​ యూరియా పేరుతో మార్కెటింగ్​

గోదావరిఖని, వెలుగు: రామగుండంలో ఎరువుల తయారీ స్పీడ్ అందుకున్నది. ఇక్కడి రామగుండం ఫెర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌) ఫ్యాక్టరీలో ప్రతిరోజూ 3 వేల టన్నుల యూరియా, 2,100 టన్నుల అమోనియా ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు సప్లై చేస్తుండగా, త్వరలోనే ఛత్తీస్‌‌గఢ్​ కు పంపనున్నారు. ఇక్కడ తయారవుతున్న ఎరువుల్లో తెలంగాణకు 46శాతం కేటాయిస్తున్నారు. దీంతో  రైతులకు ఎరువుల కష్టాలు దూరమయ్యాయి. పీఏసీఎస్​లు, షాపుల ముందు లైన్లు కనుమరుగయ్యాయి. 

గ్యాస్‌‌ బేస్డ్‌‌గా ప్లాంట్‌‌ రివైవల్‌‌... 
గతంలో కోల్​బేస్డ్​గా నడిచిన ఎఫ్‌‌సీఐ ప్లాంట్‌‌ను నష్టాల కారణంగా 1999లో మూసివేశారు. తిరిగి తెరిపించేందుకు అప్పటి ఎంపీలు దివంగత నేత     జి.వెంకటస్వామి, ఆయన కుమారుడు వివేక్‌‌ కృషి చేశారు. వారి ప్రత్యేక  చొరవతో రూ.10 వేల కోట్ల బకాయిలు మాఫీ కావడంతో పాటు బీఐఎఫ్‌‌ఆర్‌ జాబితా‌లో ఉన్న ఎఫ్‌‌సీఐ బయటపడింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గ్యాస్‌‌ బేస్డ్‌‌గా తిరిగి ఫ్యాక్టరీ రివైవల్‌‌కు నోచుకున్నది. ఈక్రమంలో 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణ జరిపి సెప్టెంబర్ 25న  నిర్మాణ పనులు ప్రారంభించారు. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర  మోడీ ఈ ప్లాంట్ కోసం మెదక్ జిల్లా  గజ్వేల్ లో  శంకుస్థాపన చేశారు.  

ఏటా 13 లక్షల మెట్రిక్‌‌ టన్నుల యూరియా ఉత్పత్తే లక్ష్యంగా.. 
ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ఫ్యాక్టరీలో 2021 ఫిబ్రవరి 28న ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించిన మేనేజ్‌‌మెంట్‌‌ పలు టెక్నికల్​ ఇష్యూస్​ను అధిగమించి అదే ఏడాది మార్చి 22  నుంచి యూరియా ఉత్పత్తి చేయం షురూ చేసింది. ఒక్కో బ్యాగ్‌‌లో 45 కిలోలు ఉండేలా వేపనూనె పూత పూసిన యూరియాను ప్రొడక్షన్‌‌ చేస్తుండగా  ఏటా 13 లక్షల మెట్రిక్‌‌ టన్నుల యూరియాను  ఉత్పత్తి చేయాలనేది టార్గెట్‌‌. ప్రస్తుతం దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను వినియోగిస్తుండగా కేవలం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 60 లక్షల మెట్రిక్‌ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం  కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో మొదటిది తెలంగాణలోని రామగుండం ప్లాంట్‌‌. వెయ్యి ఎకరాల స్థలంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని రూ.6,200 కోట్లతో పునరుద్ధరించడం విశేషం. ప్రస్తుతం ఈ ప్లాంట్‌‌లో రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం మూడు వేల మెట్రిక్‌‌ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 46 శాతం తెలంగాణ స్టేట్‌‌కు, మిగిలిన 54 శాతం ఏపీ‌, కర్ణాటకకు పంపిస్తున్నారు. ఒప్పందం మేరకు ఇందులో నుంచే ఛత్తీస్‌గఢ్​‌కు కూడా యూరియాను సప్లై చేయనున్నారు. ఉత్పత్తి చేసిన యూరియాను 80 శాతం రైలు రూట్​ ద్వారా, 20 శాతం రోడ్డు మార్గం ద్వారా పంపిస్తున్నారు. సుమారు  2,100 మెట్రిక్ టన్నుల అమోనియా ఉత్పత్తి అవుతుండగా తెలంగాణతో పాటు ఏపీ‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు చెందిన ఫార్మా కంపెనీలు కొంటున్నాయి.    

వాటాదారులు వీరే...
రామగుండం ఫెర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌) ఫ్యాక్టరీలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో పాటు తెలంగాణ స్టేట్‌‌కు కూడా వాటా ఉంది. 26 శాతం నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), 26 శాతం ఇంజినీర్స్ ఇండియా  లిమిడెట్(ఈఐఎల్), 11 శాతం  ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా లిమిటెడ్(ఎఫ్‌‌సీఐఎల్), 11 శాతం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 11.7 శాతం డెన్మార్క్ దేశానికి  చెందిన  హల్దార్‌‌ టాప్స్‌‌  కంపెనీ, 14.3 శాతం గ్యాస్‌‌ సరఫరా చేసే గెయిల్ సంస్థ ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. కాగా ఆర్ఎఫ్ సీ ఎల్ లో ఎరువులను  ప్రస్తుతం 'కిసాన్ యూరియా' పేరుతో మార్కెట్  లోకి  విడుదల చేస్తున్నారు. గతంలో దీనిని  'స్వస్థిక్ యూరియా' పేరుతో  అమ్మేవారు.  మార్కెటింగ్ బాధ్యతలను  నేషనల్ ఫెర్టిలైజర్స్  లిమిటెడ్ చూస్తోంది. ఫ్యాక్టరీలో ఎరువుల  ఉత్పత్తి  అవసరాలకు  రోజుకు 2.2  మిలియన్ మెట్రిక్‌‌ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్(ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్‌‌ను వినియోగిస్తున్నారు. ఇందుకోసం గుజరాత్ కు చెందిన జీఎస్‌‌పీఎల్ ఇండియా ట్రాన్స్ కో  లిమిటెడ్ (జీఐటీఎల్)  కంపెనీతో 2016 జులై 8న అగ్రిమెంట్​కుదుర్చుకోగా, 350 కిలోమీటర్ల దూరంలో గల కేజీ బేసిన్ లోని  తూర్పు గోదావరి జిల్లా  మల్లవరం సమీపంలో గల కూచనపల్లి  నుంచి  ఈ గ్యాస్ ను సప్లై చేస్తున్నారు. 

సబ్సిడీ చెల్లిస్తున్న కేంద్రం...
రైతులకు తక్కువ ధరకు యూరియాను అందించాలనే లక్ష్యంతో కేంద్రం సబ్సిడీని అందజేస్తున్నది. వాస్తవంగా 45 కిలోల వేప పూత పూసిన యూరియా బ్యాగ్‌‌ కు రూ.1500 ఖర్చవుతుండగా, కేవలం రూ.266.50కే అమ్ముతున్నారు. మిగతా లోటునంతా కేంద్రం ఫ్యాక్టరీకి చెల్లిస్తున్నది. గత మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 2.50 లక్షల మెట్రిక్‌‌ టన్నుల యూరియాను రైతుల దరికి చేర్చారు. అందువల్లే తెలంగాణలో ఎక్కడ కూడా రైతులు యూరియా కోసం క్యూలు, ధర్నాలు చేసిన సందర్భాలు లేవు.