ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్‌‌‌‌

ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్‌‌‌‌
  • పిల్లలు, గర్భిణులు, బాలింతల వివరాలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చేసేందుకు ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌టీఎస్‌‌‌‌ యాప్‌‌‌‌

మెదక్, వెలుగు : మహిళా, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ పథకాల అమల్లో భాగంగా ప్రతి ఏటా కుటుంబాల వివరాలను సేకరిస్తుంటారు. అంగన్‌‌‌‌వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి ఐదేళ్లలోపు ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల వివరాలతో పాటు, ఆయా కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి రిజిస్టర్‌‌‌‌లో నమోదు చేసేవారు. ఇదివరకు ఈ ప్రక్రియ మ్యాన్యువల్‌‌‌‌ విధానంలో కొనసాగేది. దీని వల్ల ఉన్నతాధికారులకు గ్రామాలు, ప్రాజెక్ట్‌‌‌‌లు, జిల్లాల వారీగా వివరాలు, పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు, గర్భిణులు, బాలింతల వివరాలు తెలుసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండేది. దీంతో పాటు పౌష్టికాహారం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

దీంతో ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు ఉమెన్‌‌‌‌ అండ్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌ అండ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌టీఎస్‌‌‌‌)అనే యాప్‌‌‌‌ను రూపొందించింది. అంగన్‌‌‌‌వాడీ టీచర్లు ఇల్లిల్లూ తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలను ఈ యాప్‌‌‌‌లో నమోదు చేస్తున్నారు. దీంతో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు జిల్లాలు, ఐసీడీఎస్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లు, గ్రామాల వారీగా వివరాలను క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. ఎవరైనా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లయితే వారి వివరాలను సైతం ఈ యాప్‌‌‌‌ ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుంది.

వివరాల నమోదులో అంగన్‌‌‌‌ వాడీ టీచర్లు

ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌టీఎస్‌‌‌‌ యాప్‌‌‌‌లో కుటుంబాల వివరాలు నమోదు చేసే ప్రక్రియ మార్చిలోనే ప్రారంభమైంది. మధ్యలో లోక్‌‌‌‌సభ ఎన్నికలు రావడం, అంగన్‌‌‌‌వాడీ టీచర్లకు బీఎల్‌‌‌‌వో బాధ్యతలు ఉండడంతో కొంత అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తికావడంతో అంగన్‌‌‌‌వాడీ టీచర్లు మళ్లీ వివరాల సేకరణ, నమోదులో నిమగ్నం అయ్యారు. ప్రతి అంగన్‌‌‌‌వాడీ టీచర్‌‌‌‌ తన పరిధిలోని అన్ని ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు, వయసు, కులం, మొబైల్‌‌‌‌, ఆధార్‌‌‌‌ నంబర్లు సేకరించి ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌టీఎస్‌‌‌‌ యాప్‌‌‌‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని 149 ఐసీడీఎస్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ల పరిధిలో 37 వేల అంగన్‌‌‌‌ వాడీ కేంద్రాల పరిధిలో కుటుంబాల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.

పిల్లల్లో పోషకాహారలోపంపై అలర్ట్‌‌‌‌

సర్వేలో భాగంగా అంగన్‌‌‌‌వాడీ టీచర్లు ప్రతి ఇంటికి వెళ్లి చిన్న పిల్లల పేర్లు, వయసు, బరువు వివరాలను సైతం సేకరించి యాప్‌‌‌‌లో నమోదు చేయనున్నారు. సర్వే మొత్తం పూర్తయ్యాక ఎవరైనా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడినా, వయసుకు తగ్గ బరువు లేకపోయినా యాప్‌‌‌‌ అలర్ట్‌‌‌‌ చేస్తుంది. దీంతో సంబంధిత పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ప్రత్యేకంగా పోషకాహారాన్నిఅందించి వయసుకు తగ్గ బరువు ఉండేలా చూసే అవకాశం కలుగుతుంది.

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌కు మెసేజ్‌‌‌‌

ప్రభుత్వం అంగన్‌‌‌‌వాడీ సెంటర్ల ద్వారా చిన్న పిల్లలు, గర్బిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తోంది. భోజనంతో పాటు, గుడ్లు, బాలామృతం వంటివి అందిస్తుండగా పలు చోట్ల అవి పక్కదారి పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యూట్రిషన్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ సిస్టంలో పిల్లలు, గర్భిణులు, బాలింతల పేర్లు యాప్‌‌‌‌లో నమోదు చేయడం వల్ల ఎవరైనా అంగన్‌‌‌‌వాడీ సెంటర్‌‌‌‌కు వెళ్లకపోతే వారు ఆబ్సెంట్‌‌‌‌ అయినట్లు సంబంధిత కుటుంబసభ్యుల మొబైల్‌‌‌‌కు మెసేజ్‌‌‌‌ వస్తుంది. ఈ విధానం వల్ల అవకతవకలు జరిగే ఛాన్స్‌‌‌‌ ఉండదు. 

సర్వే కొనసాగుతోంది 

మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 1,076 అంగన్‌‌‌‌ వాడీ కేంద్రాలు ఉండగా అన్ని చోట్ల​న్యూట్రిషన్‌‌‌‌ అండ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ సిస్టం సర్వే కొనసాగుతోంది. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల కారణంగా సర్వేకు కొంత అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఎలక్షన్‌‌‌‌ ముగిసినందున అన్ని అంగన్‌‌‌‌ వాడీ సెంటర్ల పరిధిలో సర్వేను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- బ్రహ్మాజీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి, మెదక్‌‌‌‌ జిల్లా