
హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్ పోలీసుల ఎన్ కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసి పారిపోబోతుండగా ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు. ఎన్ కౌంటర్లో రియాజ్ హతం కావడంతో నిజామాబాద్‌లో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.
కరుడుగట్టిన నేరస్థుడి పీడ విరగడం అయ్యిదంటూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాణాసంచా పేల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. ఓ వ్యక్తి ఎన్ కౌంటర్ లో మరణిస్తే స్థానికులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, 2025, అక్టోబర్ 17న నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం (అక్టోబర్ 19) పోలీసులు రియాజ్‌ను అరెస్ట్ చేశారు.
►ALSO READ | తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!
నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్‌లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో గొడవ పడి గాయాలపాలైన రియాజ్‌ను పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు రియాజ్‌ను ఎన్ కౌంటర్ చేశారు.