
హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, ఆదివారం (అక్టోబర్ 19) దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో రాగల 24 గంటల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురు గాలుల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.