
ఓలా కంపెనీలో ఉద్యోగం.. మంచి పొజిషన్.. మంచి జీతం. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటున్నాడు. ఏమైందో తెలియదు కానీ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంప్లాయ్ సూసైడ్ చేసుకున్న రెండు రోజుల తర్వాత కంపెనీ నుంచి ఉద్యోగి అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యాయి. ఇదేంటని పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆత్మహత్యకు పాల్పడ్డ ఉద్యోగి ఇంట్లో పోలీసులకు 28 పేజీల సూసైడ్ నోట్ లభించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఐటీ రాజధాని బెంగుళూరులో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. కె.అరవింద్ అనే వ్యక్తి బెంగుళూరులో ఓలా ఎలక్ట్రిక్‌లో హోమోలోగేషన్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 2025, సెప్టెంబర్ 28న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అరవింద్‌ది అసహజ మరణంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ క్రమంలో మరణించిన రెండు రోజుల తర్వాత ఓలా కంపెనీ నుంచి అరవింద్ అకౌంట్లోకి రూ.17.46 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు కంపెనీ హెచ్‌ఆర్, ఇతరు అధికారులను పోలీసులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు వచ్చాయి. దీంతో అరవింద్ మృతిపై మరిన్నీ అనుమానాలు వ్యక్తం కావడంతో అతడి ఇంట్లో పోలీసులు తనిఖీ చేపట్టగా 28 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ సూసైడ్ నోట్లో సంచలన విషయాలు వెల్లడించాడు అరవింద్.
ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్, సీనియర్ అధికారి అరవింద్ సుబ్రతా కుమార్ దాస్ మానసిక వేధింపులు, అధిక పని ఒత్తిడి, జీతం, ఇతర బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పేర్కొన్నాడు. అరవింద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఈఓ భవిష్ అగర్వాల్, సీనియర్ అధికారి సుబ్రతా కుమార్ దాస్, ఓలా కంపెనీపై 2025, అక్టోబర్ 6న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ఓలా కంపెనీ కర్నాటక హైకోర్టులో సవాల్ చేసింది.