
హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి కోటి పరిహారం అందివ్వనున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య, నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్ వివరాలను సోమవారం (అక్టోబర్ 20) డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌కు పోలీస్ శాఖ తరుఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని.. ఎలాంటి నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని స్పష్టం చేశారు.
నిందితుడు రియాజ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందజేయడంతో పాటు వాళ్ల ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రమోద్ పదవీ విరమణ వరకు వచ్చే సాలరీ అందిస్తామని.. అలాగే 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని చెప్పారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని డీజేపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ స్పందన:
నిందితుడు రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రూం బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని ఆ గన్‌తో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవని.. పోలీసుల ఆత్మరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగా రియాజ్‌ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని తెలిపారు.
కాగా, 2025, అక్టోబర్ 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ పట్టుకుని తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం (అక్టోబర్ 19) పోలీసులు రియాజ్ అరెస్ట్ చేశారు.
నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్‌లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో గొడవ పడి గాయాలపాలైన రియాజ్ ను పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని ఆసుప్రతి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు రియాజ్‌ను ఎన్ కౌంటర్ చేశారు.