
కలియుగ వైకుంఠం తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలకు వచ్చే భక్తజనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షాల కారణంగా.. శ్రీవారి ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఓ వైపు వర్షం , మరోవైపు చలిగాలులతో గదులకే పరిమితమయ్యారు భక్తులు.
గత నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఇటీవలే బండరాళ్లు రోడ్డుపై పడటంతో ఇంజనీరింగ్ అధికారులు తొలగించారు.ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో వెళ్లే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
వర్షాలపై టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, భక్తలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఏపీ వ్యప్తాంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ. వర్షాలు కురిసే ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ.