అగ్ని ప్రమాదాల నివారణకు పరిశ్రమల్లో ‘జాయింట్’ ఆపరేషన్ : సీఎస్ కె.రామకృష్ణారావు

అగ్ని ప్రమాదాల నివారణకు పరిశ్రమల్లో ‘జాయింట్’ ఆపరేషన్ : సీఎస్ కె.రామకృష్ణారావు
  •     భద్రతపై ఉమ్మడి తనిఖీ బృందాలు.. ఆన్‌‌లైన్‌‌లోనే లెక్కలు
  •     యాక్సిడెంట్ల నివారణకు పక్కా ‘మాన్యువల్’ ఉండాల్సిందే
  •     అధికారులకు సీఎస్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు, కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తుండటంపై ప్రభుత్వం సీరియస్  అయ్యింది. ఇకపై భద్రతా లోపాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమ ఏదైనా.. అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందేనని సీఎస్​ కె.రామకృష్ణారావు తేల్చిచెప్పారు. 

అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తక్షణమే స్పష్టమైన సేఫ్టీ మాన్యువల్  సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సెక్రటేరియెట్ లో పారిశ్రామిక భద్రతపై ఉన్నతాధికారులతో సీఎస్  సమీక్ష నిర్వహించారు. నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఎస్  సూచించారు. 

ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ‘జాయింట్   ఇన్‌‌స్పెక్షన్ టీమ్స్’ (ఉమ్మడి తనిఖీ బృందాలు) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, పరిశ్రమలు, కార్మిక, వైద్యారోగ్య శాఖలు, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూడిన టీమ్స్ రెగ్యులర్ గా పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్‌‌లో జరిగిన ఘోర ప్రమాదంపై సీఎస్  ప్రత్యేకంగా ఆరా తీశారు. 

ఈ దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన బాధితులకు ఎక్స్ గ్రేషియా చెల్లింపులు ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. చెల్లింపులు ఏమైనా మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి కోర్టు కేసుల పురోగతిపైనా అధికారులతో చర్చించారు.  తనిఖీల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌‌లైన్  డ్యాష్ బోర్డులో నమోదు చేయాలని ఆదేశించారు. 

కార్మికుల భద్రతకు సంబంధించి పరిశ్రమల్లో తరచూ ‘సేఫ్టీ ఆడిట్’ నిర్వహించాలని, కార్మికులకు మాక్  డ్రిల్స్, శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సంజయ్ కుమార్, దాన కిశోర్, ఫైర్  సర్వీస్  డీజీ విక్రమ్ సింగ్ మాన్, సంగారెడ్డి కలెక్టర్   ప్రావీణ్య, ఫ్యూచర్  సిటీ డెవలప్‌‌మెంట్ అథారిటీ  కమిషనర్  శశాంక, పీసీబీ మెంబర్  సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు.