Vijay Rashmika: విజయ్ దేవరకొండ ఇంట దీపావళి వేడుకలో రష్మిక .. వీడియోలో నేషనల్ క్రష్ వాయిస్!

Vijay Rashmika: విజయ్ దేవరకొండ ఇంట దీపావళి వేడుకలో రష్మిక .. వీడియోలో నేషనల్ క్రష్ వాయిస్!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ , రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దీపావళిని తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన ఫేవరెట్ పండుగ అయిన దీపావళి సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే అందులో రష్మిక మందన్న వాయిస్ ఉందంటూ అభిమానులు ఫిదా అయ్యారు.  ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో..  విజయ్ పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి.

విజయ్ పోస్ట్‌లో రష్మిక వాయిస్?

అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెబుతూ.. విజయ్ దేవరకొండ  సోమవారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు వీడియోలను షేర్ చేశారు. దీపావళి ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన పండుగ. మీకు నా ప్రేమను, పెద్ద హగ్ లను పంపిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోల్లో, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు స్నేహితులు టపాసులు కాల్చుతూ నవ్వుతూ కనిపించారు. అయితే, అందులో ఒక వీడియోలో తెరవెనుక నుంచి ఒక మహిళా గొంతు నవ్వుతూ విజయ్, విజయ్ అని పిలవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అది రష్మిక మందన్న వాయిస్ అని బలంగా  ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ఒక అభిమాని, వదిన తో కలిసి ఎప్పుడు దీపావళి చేసుకుంటావు అన్న అని అడిగారు.  మరొకరు "బాగా గమనించి వినండి... రష్మిక వాయిస్ వినిపించింది" అని కామెంట్ చేశారు. "విజయ్, విజయ్ అన్నది రష్మికే కదా?" అంటూ మరికొంతమంది ఈ విషయాన్ని ధృవీకరించడానికి ప్రయత్నించారు. ఈ వీడియోల్లో విజయ్ పెంపుడు కుక్క స్టార్మ్ కూడా రాకెట్‌లు ఆకాశంలోకి వెళ్లడం చూస్తూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నిశ్చితార్థం తర్వాత తొలి దీపావళి!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2018లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా నుండి డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' చిత్రంలో వీరి కెమిస్ట్రీ ఈ గాసిప్‌లకు మరింత బలం చేకూర్చింది. అయితే, వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ఎప్పుడూ అంగీకరించలేదు. కానీ, ఈ అక్టోబర్ మొదటి వారంలో విజయ్ టీం, రష్మికతో ఆయన నిశ్చితార్థం జరిగినట్టుగా ధృవీకరించడం సంచలనం సృష్టించింది. వీరు ఇద్దరూ ఫిబ్రవరి 2026లో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం వార్తల తర్వాత వచ్చిన తొలి దీపావళి కావడంతో, ఈ వేడుకకు రష్మిక హాజరై ఉంటారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

బిజీ బిజీగా విజయ్ , రష్మిక..

సినిమాల విషయానికి వస్తే..  రష్మిక మందన్న హిందీ చిత్రం 'తమ్మ' ఈ దీపావళి సందర్భంగా అంటే అక్టోబర్ 21న నేడు థియేటర్లలో విడుదలైంది. హారర్-కామెడీగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో 'ది గర్ల్‌ఫ్రెండ్', హిందీలో 'కాక్‌టెయిల్ 2' వంటి ప్రాజెక్ట్‌లు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ఆయన త్వరలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక పీరియడ్ చిత్రంలో నటించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'టాక్సీవాలా' మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, త్వరలో 'VD14' (వర్కింగ్ టైటిల్) లో కలిసి నటించనున్నారు. ఈ సినిమాను రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీని పంచుకోబోతున్న ఈ జంట గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.