Daniel Naroditsky: 29 ఏళ్లకే చెస్ గ్రాండ్‌మాస్టర్ డేనియల్ నరోడిట్స్కీ ఆకస్మిక మరణం

Daniel Naroditsky: 29 ఏళ్లకే చెస్ గ్రాండ్‌మాస్టర్ డేనియల్ నరోడిట్స్కీ ఆకస్మిక మరణం

క్రీడా ప్రపంచంలో విషాదం. అంతర్జాతీయ చెస్ ప్లేయర్  డేనియల్ నరోడిట్స్కీ మరణించారు. సోమవారం (అక్టోబర్ 20) బే ఏరియాకు చెందిన 29 ఏళ్ల చెస్ గ్రాండ్‌మాస్టర్ మరణించినట్లు అతని కుటుంబం ప్రకటించింది. డేనియల్ 18 సంవత్సరాల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌తో సహా అనేక ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల US నేషనల్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని చెస్ లో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్ళు, చెస్ ప్రముఖులు తమ బాధను వ్యక్తం చేస్తూ తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

"డేనియల్ ప్రతిభావంతులైన చెస్ ఆటగాడు. వ్యాఖ్యాత, విద్యావేత్త, చెస్ కమ్యూనిటీలో ఇష్టమైన సభ్యుడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో పాటు ఆరాధించే వ్యక్తులు అతనికి ఉన్నారు". అని అతని కుటుంబం షార్లెట్ చెస్ సెంటర్ పంచుకున్న ఒక ప్రకటనలో తెలిపింది. భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ.. నరోడిట్స్కీ మరణ వార్తపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశాడు. తనకు ఈ విషయం   "పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేసింది". అని తెలిపాడు. ఇక ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆర్‌బి రమేష్ ఇలా పోస్ట్ చేశారు: " డేనియల్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి". అని తెలిపాడు. 

ఎవరీ నరోడిట్స్కీ..? 

శాన్ మాటియోలో జన్మించిన నరోడిట్స్కీ చెస్ ప్రయాణం చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఉత్తర కాలిఫోర్నియా కె-12 చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఆ తరువాత 2007లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-12 విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 2013లో యూఎస్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాడు. 2013లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సంపాదించినందుకు గాను నరోడిట్స్కీకి 2014లో ప్రతిష్టాత్మక సామ్‌ఫోర్డ్ చెస్ ఫెలోషిప్ లభించింది. ఇక 2019లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.