హైదరాబాద్: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్ పోలీసుల ఎన్ కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసి పారిపోబోతుండగా ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు. ఈ క్రమంలో రియాజ్ ఎన్ కౌంటర్‌పై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య కీలక ప్రకటన చేశారు.
నిందితుడు రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడు. కానిస్టేబుల్ ఆసిఫ్ చెకింగ్‌లో భాగంగా రియాజ్ గది వద్దకు వెళ్లగా పెద్ద శబ్దం వినిపించటంతో రూమ్‌లోకి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆసిఫ్ దగ్గరున్న తుపాకీ రియాజ్ లాక్కున్నాడు. అనంతరం రియాజ్ ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని సీపీ క్లారిటీ ఇచ్చారు.
రియాజ్ ఎన్ కౌంటర్‌పై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. రియాజ్ చేతిలో గాయపడ్డ కానిస్టేబుల్ ఆసిఫ్ రెండు చేతులకు తీవ్ర గాయ్యాలయ్యాయని.. అతని చేతులు పని చేయాలంటే ఏడాది పడుతుందని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. ప్రొసిజర్ ప్రకారం రియాజ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.
కాగా, 2025, అక్టోబర్ 17న నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది.
ఈ క్రమంలోనే ఆదివారం (అక్టోబర్ 19) పోలీసులు రియాజ్‌ను అరెస్ట్ చేశారు. నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్‌లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో గొడవ పడి గాయాలపాలైన రియాజ్‌ను పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు రియాజ్‌ను ఎన్ కౌంటర్ చేశారు.
