Ram Pothineni: 'ఒక్క రాత్రిలో సర్వం కోల్పోయాం'.. తండ్రి కష్టంపై రామ్ పోతినేని ఎమోషనల్!

Ram Pothineni: 'ఒక్క రాత్రిలో సర్వం కోల్పోయాం'.. తండ్రి కష్టంపై రామ్ పోతినేని ఎమోషనల్!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమా అపజయాలతో నిరాశలో ఉన్నారు. ఈ సారైనా గట్టి హిట్ కొట్టాలన్న లక్ష్యంగా  'ఆంధ్ర కింగ్‌ తాలుకా' చిత్రంతో రెడీ అవుతున్నారు. ఈ మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా సీనియర్‌ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'కి అతిథిగా రామ్ వచ్చారు. తన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా తన తండ్రి పడిన కష్టం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన సినిమా కెరీర్‌లోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ఎదురైన ఎన్నో ఒడుదొడుకుల గురించి రామ్ పంచుకున్నారు.  రామ్ పోతినేని హైదరాబాద్‌లో పుట్టారు, కానీ వారి కుటుంబానికి స్వస్థలం విజయవాడ. ఆయన తండ్రి మురళి పోతినేని ఒక బిజినెస్ మ్యాన్. అయితే1988లో విజయవాడలో జరిగిన కుల ఘర్షణల కారణంగా వారి కుటుంబం అప్పటివరకు సంపాదించిన ఆస్తి, సంపద అంతా ఒక్క రాత్రిలోనే కోల్పోయిందని చెప్పారు.. అప్పుడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన రామ్ తండ్రి మురళి పోతినేని, ఆ పరిస్థితుల్లో విజయవాడలో ఉండడం సరికాదని భావించి కుటుంబాన్ని చెన్నైకి తరలించారు. కింద నుంచి పైకి రావడం వేరు, కానీ అన్నీ పోగొట్టుకుని, మళ్లీ కొత్త నగరంలో జీరో నుంచి జీవితాన్ని ప్రారంభించడం మరింత కష్టం. మా నాన్న ఆ కష్టాన్నే అనుభవించారు. అందుకే ఆయనంటే నాకు ఎంతో గౌరవం అని రామ్ తెలిపారు.

తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ, విజయవాడలోని తమ పెద్ద ఇంట్లో తన బొమ్మల కోసం ఒక ప్రత్యేక గది ఉండేదని, కానీ చెన్నైకి మారిన తరువాత అద్దెకు తీసుకున్న ఇల్లు మొత్తం కలిపినా, ఆ బొమ్మల గదిలో సగం కూడా లేదని రామ్  చెప్పారు. అప్పుడు తన తండ్రి జీతం నెలకు కేవలం నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు మాత్రమేనని, అలాంటి కష్టాల నుంచి మళ్లీ తమ కుటుంబాన్ని నిలబెట్టారని రామ్ తన తండ్రి త్యాగాన్ని వివరించారు. 

2006లో 'దేవదాసు' చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసి, మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు రామ్. అయితే ప్రస్తుతం చాలా కాలంగా ఎదురవుతున్న ఫెయిల్యూర్స్ నుండి బయటపడాలని చూస్తున్నారు., పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన 'ఆంధ్ర కింగ్‌ తాలుకా' చిత్రంతో హిట్‌ కొట్టాలని కృషి చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ 28న విడుదల కానుంది.