జూన్​30 లోపు కాళేశ్వరం రిపేర్లు!

జూన్​30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
  • వరదలు వచ్చేలోపు పనులు కంప్లీట్​ చేయాలని ప్రభుత్వం టార్గెట్​ 
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ రిపేర్లపై కసరత్తు ముమ్మరం
  • బేషరతుగా పనులు చేసేందుకు ఒప్పుకున్న ఎల్​అండ్​ టీ
  • రాత్రింబవళ్లూ బ్యారేజీలకు రిపేర్లు చేయనున్న నిర్మాణ సంస్థ
  • సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో మంత్రి ఉత్తమ్​ సమీక్ష

హైదరాబాద్​, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులను జూన్​ 30లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఇందులో భాగంగా​ఇరిగేషన్​ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఫ్లడ్​ వచ్చేలోపు రాత్రింబవళ్లూ పనులు చేయాలని నిర్ణయించారు. అందుకు నిర్మాణ సంస్థ ఎల్అండ్​ టీ కూడా అంగీకరించినట్టు అధికారులు చెప్తున్నారు. గురువారం సెక్రటేరియెట్​లో ఇరిగేషన్​శాఖ అధికారులు, సీడబ్ల్యూపీఆర్ఎస్​ నిపుణులు, ఎల్ అండ్​ టీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా, స్పెషల్​ సెక్రటరీ ప్రశాంత్​ జీవన్​ పాటిల్, ఈఎన్సీ (జనరల్​) అనిల్​కుమార్, ఈఎన్సీ (ఓ అండ్​ ఎం) నాగేందర్​ రావు, ఎల్​ అండ్​ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. బ్యారేజీలు, పంప్​హౌస్​ల వద్దకు సీఎం రేవంత్​ రెడ్డి వచ్చే వారం వెళ్లనున్న నేపథ్యంలో పనులు సాగుతున్న తీరుపై అధికారులను మంత్రి ఆరా తీశారు. వరదలు వచ్చే లోపు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ పనులే ప్రయారిటీ..

బ్యారేజీలో వాస్తవానికి సీకెంట్​ పైల్స్, రాఫ్ట్​లు కలిపి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే, వాటిని జస్ట్​ జాయింట్స్​లాగా చేయడంతోనే పిల్లర్లు, రాఫ్ట్​, షీట్​పైల్స్​కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ కుంగిందని చెప్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ మరింత డ్యామేజ్​ కాకుండా ఉండాలంటే రాఫ్ట్​, పిల్లర్ల కింద ఉన్న గ్యాప్​ను ఫిల్​ చేయడమే అత్యంత ప్రాధాన్యమైన పని అని స్పష్టం చేస్తున్నారు. రాఫ్ట్​ దగ్గర ఓ రంధ్రం చేసి.. ఇసుక, ఇతర మిశ్రమాలను ప్రెజర్​ ద్వారా ఖాళీల్లో నింపాలని నిర్ణయించారు. ఆ తర్వాత కొట్టుకుపోయిన ప్రదేశాలు, దెబ్బతిన్న ప్రాంతాల్లో షీట్​పైల్స్​ను రీప్లేస్​ చేస్తామని చెప్తున్నారు.

ఈ పనులయ్యాక గేట్లను ఎత్తుతామని వెల్లడించారు.  ఎత్తలేని పరిస్థితి ఉన్న గేట్లను పూర్తిగా తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. రాత్రి, పగలు తేడా లేకుండా పనులు చేసి జూన్​ 30 లోపు ఎంత పనులైతే అంత వరకు చేయాలని డిసైడ్​ అయ్యారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీలో పనులు చేసే చోట వరద రాకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట కట్టి, పనులు చేపడతామని అధికారులు చెప్పారు. బ్యారేజీలను కాపాడుకునేలా చర్యలు చేపట్టి.. వచ్చే సీజన్​లో నీళ్లను తోడిపోసుకునేలా చూడాలని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 

పనులు చేసేందుకు ఎల్​అండ్​టీ ఓకే 

బ్యారేజీల రిపేర్లను చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్అండ్​ టీ బేషరతుగా ఒప్పుకున్నట్టు తెలిసింది. తొలుత కొత్తగా ఒప్పందం చేసుకునేదాకా పనులు చేయబోమని సంస్థ చెప్పింది. అయితే, పనులు చేయకుంటే క్రిమినల్ కేసులకూ వెనుకాడొద్దని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అదే విషయాన్ని ఎల్ అండ్​ టీ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్​, అధికారులు స్పష్టం చేశారు. దీంతో గోదావరికి వరదలు స్టార్ట్​ అయ్యేలోపు పనులను పూర్తి చేసేలా సంస్థ అంగీకరించినట్టు సమాచారం. వీలైనంత త్వరగా పూర్తిచేసేలా డే అండ్​ నైట్​ పని చేస్తామని చెప్పినట్టు తెలిసింది.

మరోవైపు బ్యారేజీలను పరిశీలించిన సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్​ (సీడబ్ల్యూపీఆర్​ఎస్​) నిపుణులు.. బ్యారేజీలకు జరిగిన డ్యామేజీ తీవ్రంగా ఉందని అధికారులతో చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా మూడు బ్యారేజీల వద్ద తమ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. సోమవారం నుంచి ఆయా బ్యారేజీల వద్ద సంస్థ నిపుణులు ఇన్వెస్టిగేషన్స్​ ప్రారంభిస్తారని తెలుస్తున్నది. ఇటు రిపేర్ల పనులు జరుగుతుండగానే టెస్టులు కూడా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

జూన్​ 6న జస్టిస్ ​పీసీ ఘోష్​ రాక 

ప్రాజెక్ట్​ అవకతవకలపై ఏర్పాటైన జ్యుడీషియల్ ​కమిషన్​ కూడా విచారణను మరింత వేగవంతం చేయనున్నది. జూన్​ 6న కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్ (పీసీ ఘోష్​)​ రానున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈసారి పది రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణ చేయనున్నట్టు తెలుస్తున్నది. అప్పటికి ఎన్నికల రిజల్ట్​ వచ్చేసి కోడ్​ కూడా ముగుస్తుండడంతో.. విచారణను మరింత వేగంగా చేస్తారని అధికారులు చెప్తున్నారు. అప్పుడే జ్యుడీషియల్​ కమిషన్​ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన సజెషన్​ బాక్సులోని ఫిర్యాదులను పరిశీలించనున్నారు. అవసరాన్ని బట్టి ఎవరెవరిని విచారణకు పిలవాలన్నది నిర్ణయించనున్నారు.