- ఇజ్రాయెల్ దాడుల్లో 25 మందికి పైగా మృతి
- దేశంలో 687కు చేరిన మరణాలు
బీరుట్: ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం లెబనాన్‌ను అతలాకుతలం చేస్తోంది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో లెబనాన్ రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ, తూర్పు ప్రాంతాలలో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
సైడాన్ సమీపంలోని అర్కి పట్టణంలో జరిగిన దాడిలో ఐదుగురు చిన్నారులతో సహా తొమ్మిది మంది మరణించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీరుట్‌లోని నివాస ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోంది. గత యుద్ధాల్లో ఎప్పుడూ దాడులకు గురికాని బీరుట్‌లోని నబా, బౌర్జ్ హమ్మూద్ వంటి జనసమ్మర్థం గల ప్రాంతాలపైనా తాజాగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.
టైర్ ఫల్సే ప్రాంతంలో బాధితులకు సాయం చేసేందుకు వెళ్తున్న ఒక అంబులెన్స్‌పై కూడా ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. హిజ్బుల్లా రవాణాకు అడ్డుకట్ట వేయడానికి అంటూ లిటానీ నదిపై ఉన్న కీలకమైన 'జ్రారీ వంతెన'నూ ఇజ్రాయెల్ పేల్చివేసింది.
హిజ్బుల్లాకు చెందిన నగదు నిల్వలు ఉన్నాయనే నెపంతోనే ఇజ్రాయెల్ జనావాసాలపై దాడులు చేస్తోందని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల లెబనాన్‌లో 687 మంది మరణించారు. సుమారు 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
గుటెర్రస్ సంఘీభావం.. ఖతార్ ఖండన
లెబనాన్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు తాను బీరుట్కు చేరుకున్నానని యూఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్ వెల్లడించారు. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖతార్ ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది.
